► 5.40 కోట్ల ఎకరాల్లో వరి.. 2.45 కోట్ల ఎకరాల్లో పత్తి
► 2.87 కోట్ల ఎకరాల్లో పప్పుధాన్యాలు.. జాతీయ నివేదిక వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రుతుపవనాలు సకాలంలో రావడమే ఇందుకు కారణమని కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి 19.14 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈ ఏడాది 19.78 కోట్ల ఎకరాల్లో సాగైనట్లు పేర్కొంది. మొత్తం సాగులో 5.40 కోట్ల ఎకరాల్లో వరి నాట్లు వేయగా, పప్పుధాన్యాల పంటలు 2.87 కోట్ల ఎకరాల్లో సాగయ్యాయి. పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం గతేడాది కంటే 73 లక్షల ఎకరాలు పెరిగింది.
రాష్ట్రంలో మాత్రం పప్పుధాన్యాల సాగు పెద్దగా పుంజుకోలేదు. వీటి సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.35 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది ఇదే సమయానికి 12.12 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాలను సాగు చేశారు. ఇక గతేడాది దేశవ్యాప్తంగా 2.30 కోట్ల ఎకరాల్లో పత్తి సాగైతే, ఈసారి 2.45 కోట్ల ఎకరాల్లో సాగవుతోంది. తెలంగాణలో గతేడాది ఇదే కాలంలో 26.80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తే, ఈ ఏడాది ఇప్పటివరకు 42.17 లక్షల ఎకరాల్లో వేయడం గమనార్హం.