
మక్తల్‌లో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి జే.పీ.నడ్డా, పక్కన అభ్యర్థి కొండయ్య ధన్వాడలో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి, చిత్రంలో నారాయణపేట అభ్యర్థి రతంగ్ పాండురెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కమలదళంలో కొత్త ఉత్సాహం నెలకొంది. రానున్న ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బీజేపీ ముఖ్యనేతల పర్యటనలు శ్రేణుల్లో జోష్ నింపుతున్నాయి. కేంద్ర మంత్రులు, రాష్ట్రంలోని ముఖ్యనేతల వరుస పర్యటనలతో పార్టీ యంత్రాంగాన్ని రంగంలోకి దించుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం ఒక్క రోజే కేంద్ర మంత్రి జే.పీ.నడ్డా, బీజేపీ శాసనసభా పక్ష మాజీ నేత కిషన్‌రెడ్డిలు సుడిగాలి పర్యటనలు చేసి ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో గెలుచే అవకాశమున్న స్థానాలను వదులుకోకూడదని స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లాలోని రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో.. ఆయా స్థానాల్లో అవలంభించాల్సిన ప్రచారంపై సూచనలు ఇచ్చారు. అలాగే జిల్లా పార్టీ ప్రచార పర్వాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ శ్రేణులు ఎక్కడిక్కడ వాలిపోయారు. జిల్లాలో పార్టీ ప్రచారశైలి, నిధుల ఖర్చు తదితర కీలకమైన అంశాలను స్వయంగా పార్టీ హైకమాండ్ పర్యవేక్షిస్తోంది. అంతేకాదు ఎప్పటికప్పుడు సర్వేలతో నియోజకవర్గాలో అభ్యర్థి బలాలు, బలహీనతలపై నివేదికలు తయారు చేస్తూ ప్రచారాన్ని కొంత పుంతలు తొక్కిస్తున్నారు.
పక్కా ప్రణాళిక
మహబూబ్‌నగర్ జిల్లాలోని అయిదు నియోజకవర్గాలకు గాను బీజేపీ ప్రస్తుతం రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మక్తల్ నుంచి కొండయ్య, నారాయణపేట నుంచి రతంగ్‌పాండురెడ్డి అభ్యర్థిత్వాలను ఇటీవల ఖరారు చేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచార పర్వాన్ని మరింత ముమ్మరం చేసింది. తెలంగాణ ఎన్నికల్లో అతి ముఖ్యంగా పాలమూరు జిల్లాపై బీజేపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో కేంద్ర మంత్రుల పర్యటనలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్న కేంద్రమంత్రి జే.పీ.నడ్డా మొట్ట మొదటి ఎన్నికల ప్రచారాన్ని జిల్లా నుంచే ప్రారంభించారు. ఈ మేరకు మంగళవారం మక్తల్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశమై బీజేపీ గెలుపు ఆవశ్యకతను కార్యకర్తలకు వివరించారు.
అలాగే బీజేపీ శాసనసభా పక్ష తాజామాజీ జి.కిషన్‌రెడ్డి మహబూబ్‌నగర్ నియోజకవర్గ కేంద్రంతో పాటు నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడలో ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. పార్టీ మండలాల అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలతో సమావేశమయ్యారు. ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతీ మండలం పరిధిలోని శక్తి కేంద్రాలతో పాటు ఓటరు జాబితాలోని ఒక్కో పేజీ(పన్నా)కి ఒక్కొక్కరు ఇన్‌చార్జిలుగా వ్యవరించాలని సూచిస్తూ వారి బాధ్యతలను గుర్తు చేశారురు. ఓటరు జాబితాలోని 15 మంది ఓటర్లకు ఒకరు పన్నా ఇన్‌చార్జిగా వ్యవహరించి వారిని పార్టీ అభ్యర్థికి ఓటు వేసేలా చూడాలని సూచించారు. బీజేపీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకత, దేశసమగ్రత వంటి వాటిని ఉద్బోదిస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
టీఆర్‌ఎస్‌పై పెంచుతున్న డోస్
బీజేపీ ఓవైపు సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూనే మరో వైపు విపక్షాలపై విమర్శల దాడిని పెంచుతోంది. ముఖ్యంగా నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పై మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రధానంగా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి విమర్శల జడివాడ కురిపిస్తున్నారు. ముందస్తు ఎన్నికల వల్ల ప్రజలపై పడుతున్న భారం.. కేసీఆర్ కుటుంబ పాలనను ప్రధానంగా ప్రస్తావిస్తూనే.. ఆత్మగౌరవ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదే విధంగా టీఆర్‌ఎస్ – ఎంఐఎం స్నేహాన్ని ప్రస్తావిస్తూ రజాకార్ల పాలన అంటూ ప్రజల్లో బావోద్వేగాలను పెంచుతున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది. డబుల్ బెడ్‌రూం ఇళ్ల విషయంలో కేంద్రం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తోందని లెక్కలను వివరిస్తున్నారు. అలాగే పాలమూరుకు సంబంధించి వలదదసల అంశాన్ని ప్రస్తావిస్తూ... ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ దుయ్యబడుతోంది. ఇంకా తలాఫున కృష్ణమ్మ పారుతున్న ప్రాజెక్టులను పూర్తి చేసి సస్యశ్యామలం చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిందంటూ విమర్శలు చేస్తున్నారు. వీటితో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, టీడీపీల వైఫల్యాలను కూడా ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా ప్రత్యామ్నాయ పార్టీగా ఈసారి బీజేపీకి ఓటు వేయాలంటూ ప్రజలను కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment