కె.తారకరామారావు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీశాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం కల్వకుర్తికి రానున్నారు. రానున్న ఎన్నికల బరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా ఏర్పాటుచేసే ప్రచార సభలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కల్వకుర్తి ప్రచారసభకు గతంలోనే ఓసారి ముహూర్తం ఖరారైనా అనూహ్య పరిణామాల నేపథ్యంలో వాయిదా వేశారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వ్యవహారం టీఆర్‌ఎస్‌కు కొరకరాని కొయ్యలా తయారైంది. తనకు టికెట్ నిరాకరించారనే నిరాశతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు మండలాల్లో సమావేశాలు ఏర్పాటుచేసిన ఆయన అనుచరులు కసిరెడ్డి బరిలో నిలవాలంటూ తీర్మానాలు చేస్తున్నారు.
దీంతో ఆయన కూడా ఇండిపెండెంట్‌గా పోటీకి దిగాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు కసిరెడ్డితో ఎన్ని పర్యాయాలు సంప్రదింపులు జరిపినా... వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంతో వదిలేశారు. దీంతో మంత్రి కేటీఆర్ కల్వకుర్తి పర్యటనను ఖరారు చేశారు. ఎన్నికల బరిలో నిలిచే పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్... మంత్రి కేటీఆర్ సభను విజయవంతం చేసి బలం చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నికల బరిలో నిలిచే అంశమై సభ జరగనున్న గురువారమే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
వదులుకున్నట్లే...
కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వ్యవహారం టీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారింది. అసెంబ్లీ రద్దు అనంతరం అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచి కల్వకుర్తి వ్యవహారం టీఆర్‌ఎస్ అధిష్టానాన్ని చికాకు పెట్టిస్తోంది. అలాగే కల్వకుర్తి టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నేతలు గుర్రుగా ఉన్నారు. అభ్యర్థులను ప్రకటించిన రోజే పార్టీ ముఖ్యనేత బాలాజీసింగ్ అనుచరులు ఏకంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతిని లేకుండా చేసేందుకు మంత్రి కేటీఆర్ పలుమార్లు చర్చలు జరిపారు. ఆశావహులందరికీ అన్ని విధాలుగా నచ్చజెప్పి పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేయాలని సూచించారు.
మిగతా అందరి వ్యవహారం సద్దుమణిగినా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా కసిరెడ్డి అనుచరులు నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ పార్టీ టికెట్ నిరాకరించినందున.. స్వతంత్ర బరిలో నిలవాలంటూ పట్టుబడుతున్నారు. అంతేకాదు హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దకు ప్రతీ రోజు వెళ్లి ఇదే విషయమై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆయన కూడా కార్యకర్తల మనోభీష్టం మేరకు బరిలో ఉండేందుకు అంగీకరించినట్లు వారి అనుచరులు పేర్కొంటున్నారు. ఇక చేసేదేం లేక టీఆర్‌ఎస్ అధిష్టానం కూడా కసిరెడ్డిని వదులుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 14న వెల్దండలో కేటీఆర్ సభ జరగాల్సి ఉన్నా... కసిరెడ్డి విషయం ఎటూ తేలకపోవడంతో వాయిదా వేశారు.
ఏం చేస్తారో...
కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ తరఫున గత మూడేళ్లుగా అన్నీ తానై నడిపించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం చర్చనీయాంశగా మారింది. రాష్ట్ర స్థాయిలో పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే వారి విషయంలో టీఆర్‌ఎస్ అధిష్టానం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఆయా నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మిగతా వారికి కఠిన హెచ్చరికలు పంపుతోంది.
ఈ నేపథ్యంలో కల్వకుర్తి ఎన్నికల బరిలో నిలిచేందుకు పావులు కదుపుతున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రి కేటీఆర్ గురువారం కల్వకుర్తికి రానున్న నేపథ్యంలో ఈ సభకు ఎమ్మెల్సీ డుమ్మా కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు కసిరెడ్డి సైతం గురువారమే తాను బరిలో నిలిచే విషయమై ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధి ష్టానం కూడా కల్వకుర్తి సభా వేదికగా లేదా అనంతరం కసిరెడ్డిని సస్పెండ్ చేస్తూ చేప్రకటన చేసే అవకాశమున్నట్లు సమాచారం.
కసిరెడ్డి ఫొటో లేకుండానే ఫ్లెక్సీలు
కల్వకుర్తి : కల్వకుర్తిలో గురువారం జరగనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ హాజరుకానుండడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్ సభ విజయవంతానికి శ్రేణుల సాయంతో కృషి చేస్తున్నారు. కాగా.. అభ్యర్థిగా జైపాల్‌ను ప్రకటించిన నాటి నుంచి అసమ్మతి రాగం ఆలపిస్తున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కల్వకుర్తి సభకు గైర్హాజరు కానున్నట్లు తెలుస్తుండగా.. పార్టీ కూడా ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు జైపాల్‌యాదవ్ నివాసంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలో కసిరెడ్డి ఫొటో లేకపోవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. కేటీఆర్ పాల్గొనున్న సభావేదికపై ఏర్పాటుచేయనున్న ఫ్లెక్సీని కూడా కసిరెడ్డి ఫొటో లేకుండా సిద్ధం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్సీపై చర్యలు తీసుకునే క్రమంలోనే అధిష్టానం నుంచి వచ్చిన సూచనలతో ఇలా చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment