గజ్వేల్/జగదేవ్‌పూర్: కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు కాల్వల భూసేకరణ సర్వే పనులను ఆదివారం రెండు ప్రాంతాల్లో రైతులు అడ్డుకున్నారు. మర్కూక్‌లో తహసీల్దార్ మల్లేశం, వీఆర్వోలు భూసర్వే జరిపి హద్దులు పాతుతున్నారు. అంతలో రైతులు వచ్చి.. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకుండానే కాల్వల పేరిట మా భూముల్లోకి వచ్చి హద్దులు పాతుతారా.. అంటూ వాగ్వాదానికి దిగారు.
భూములను ఇవ్వబోమంటూ రైతులు సర్వేను అడ్డుకొన్నారు. అధికారులు వేసిన హద్దులను తొలగించారు. కాగా, మర్కూక్ మండలం చేబర్తిలో ఉదయం 10 గంటలకు సర్వేయర్లు, నీటిపారుదల శాఖ అధికారులు సర్వే పనులు ప్రారంభించగా, రైతులు అక్కడకు వెళ్లి వెంటనే ఆపాలని, లేకుంటే ఆందోళన చెస్తామని హెచ్చరించారు. దీంతో అధికారులు సర్వే పనులు ఆపేశారు.