సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలుగు నేలపై గలగల పారుతున్న కృష్ణమ్మకు ప్రమాదం పొంచి ఉందా..? వ్యర్థాలతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. తీరం వెంట ఉన్న పరిశ్రమలు వెదజల్లే వ్యర్థాలు.. డ్రైనేజీల మురుగు నేరుగా నదిలో కలుస్తోంది. తీరం వెంబడి పొలాల్లో ఉపయోగించే రసాయనా లు కూడా కృష్ణానదిలో కలుస్తుండటంతో నదీ జలా లు కలుషితం అవుతున్నాయి.
తద్వారా జీవరాశుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటికే నదీ దాదాపు 61 శాతం కుచించుకుపోయినట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు. నదికి ఇరువైపులా కిలోమీటర్ల మేర నిలువ నీడ కూడా లేదు. ఇలాంటి కారణాలతో రాబోయే 30 ఏళ్లలో కృష్ణానదీ మనుగడ తీవ్ర ప్రమాదంలో పడనుందని హెచ్చరిస్తున్నారు.
ప్రాభవం కోల్పోతున్న కృష్ణమ్మ
జీవనది కృష్ణమ్మ తన ప్రాభవం కోల్పోతోంది. ఏటా నది ప్రవాహం తగ్గిపోతోందని పదేళ్ల గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రవాహాలు పడిపోతుండటంతో ఏడాదిలో దాదాపు ఆరు నెలలపాటు చుక్కనీరు కూడా పారే పరిస్థితి కనిపించడంలేదు. విష వ్యర్థాలు నదిలో కలుస్తుం డటంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు ప్రాం తం పరిధిలో కలుషితాలు కలుస్తున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది.
రాయిచూరు శక్తినగర్‌లోని కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాలు నేరుగా నదిలో కలుస్తున్నాయి. బీచుపల్లి, కర్నూలు ఏరియాలోని కొన్ని పరిశ్రమల నుంచి కూడా ప్రమాదకర వ్యర్థాలు వెలువడుతున్నాయి. గద్వాల ప్రాం తంలోని పరిశ్రమల వ్యర్థాలు నేరుగా జములమ్మ రిజర్వాయర్‌లో కలుస్తుండటంతో స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు కాలుష్య పరిశ్రమలను సీజ్ చేశారు. అయితే ఈ వ్యర్థాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
పీసీబీకి ఫిర్యాదు చేస్తాం
‘కృష్ణానదీ పరీవాహకంలో వ్యర్థాలు కలుస్తున్నట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు జములమ్మ రిజర్వాయర్‌లో కలుషితాలు కలుస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే పీసీబీకి ఫిర్యాదు చేశాం. అందుకు అనుగుణంగా వారు చర్యలు కూడా తీసుకున్నారు. అలాగే ఇంకా ఏమైన కలుషితాలు నదిలో కలుస్తున్నట్లు మాకు ఫిర్యాదులు రాలేదు.’ అని చీఫ్ ఇంజనీర్ ఖగేందర్ అన్నారు.
వ్యర్థాలతో కలుషితం
మేము పది రోజులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని కృష్ణానదీ తీరం వెంట దాదాపు 270 కి.మీ మేర పాదయాత్ర చేశాం. అనేక విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. చాలా వ్యర్థాలు వచ్చి నదిలో కలుస్తున్నాయి. దీని వల్ల జీవరాశులు చనిపోతున్నాయి. నదీ పరీవాహక ప్రాంతంలో చాలా చోట్ల కనుచూపు మేర ఒక్క చెట్టు కూడా కనిపించడం లేదు. నదీ పరిసరాల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. – జలజం రమేశ్‌గౌడ్, సామాజికవేత్త, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment