రెండు రాష్ట్రాల వాదనలను విననున్న బోర్డు
ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘనలపై తెలంగాణ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణాజలాల వినియోగం, శ్రీశైలం, నాగార్జునసాగర్ విద్యుత్ ఉత్పత్తి అంశాలపై నేడు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనలు వినిపించనున్నాయి. వివాదం మొదలైన అనంతరం తొలిసారి బోర్డు ఉభయ పక్షాలతో నిర్వహిస్తున్న సమావేశం ఇదే కావడం గమనార్హం. బోర్డు చైర్మన్ ఎస్‌కేజీ పండిత్ , బోర్డు సభ్యకార్యదర్శి ఆర్‌కే గుప్తా నేతృత్వంలో ఎర్రమంజిల్‌లోని జలసౌధలో జరగనున్న ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్‌రావు, ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషీ, ఈఎన్‌సీ మురళీధర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులు హాజరుకానున్నారు. రెండురాష్ట్రాల విద్యుత్‌శాఖ అధికారులు కూడా ఇందులో పాల్గొంటారు. శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టాలపై వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలిచ్చిన జీవోలపై వాదనలు జరగనున్నాయి.
834 అడుగుల కనీస మట్టాన్ని చెబుతున్న జీవో 69, అలాగే 854 అడుగులకే పరిమితం కావాలంటున్న జీవో 107లతో పాటూ 2005లో ఇచ్చిన జీవో 233లపై రెండురాష్ట్రాలు తమ వైఖరులను చెప్పనున్నాయి. బచావత్ అవార్డును గౌరవించాలని, రాష్ట్ర విభజన చట్టాన్ని ఏపీ పట్టించుకోవడంలేదనే అంశాన్ని తెలంగాణ గట్టిగా వినిపించనుంది. హక్కుమేరకే నీరు వినియోగిస్తున్నామని, విద్యుత్ విషయంలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడడంలేదని బోర్డు ముందు గట్టిగా చెప్పనుంది. ఏపీకి ఉన్న నికరజలాల్లో ఇప్పటికే అదనంగా నీరు తీసుకెళ్లిన అంశాన్ని కూడా ప్రస్తావించనుంది. టీడీపీ హయాంలో ఏనాడూ కనీస నీటిమట్టాలను పాటించకుండా ఏటా ఉల్లంఘనలకు పాల్పడిన వివరాలను వివరించనుంది. పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికి ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ ప్రాజెక్టులకు కొనసాగుతున్న నీటి ప్రవాహాలకు అడ్డుకట్ట వేయాలని బోర్డును కోరనుంది. నదీజలాల వినియోగం విద్యుత్‌తో ముడివడి ఉన్నందున, ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన 54 శాతం వాటాను ఇప్పించేలా బోర్డు జోక్యం కోరనున్నట్టు తెలిసింది.
బోర్డు ముందు నేడు ‘కృష్ణా’ పంచాయితీ
Published Wed, Oct 29 2014 1:47 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement