గద్వాల, న్యూస్‌లైన్: కరువు నేలపై కృష్ణాజలాలు పారనున్నాయి. జిల్లాలో వెనకబడిన ప్రాంతంగా పేరొందిన గట్టు మండలం ఇక సస్యశ్యామలం కానుంది. అనేక దశాబ్దాలుగా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ ప్రాంత భూములను కృష్ణానది నీటితో సస్యశ్యామలం చేసేందుకు ప్రతిపాదించిన ‘గట్టు ఎత్తిపోతల పథకం’ సమగ్రసర్వేకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటికే ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇవ్వడంతో మరోరెండురోజు ల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయని తెలిసింది.
ఈ పథకం పూర్తయితే గద్వాల నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కృష్ణానది నీళ్లు ఎత్తిపోతల ద్వారా అందనున్నాయి. కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టును గద్వాల డివిజన్‌లోనే నిర్మించినప్పటికీ ఈ ప్రాంతంలో కేవలం 37వేల ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉంది. దీంతో నడిగడ్డను సస్యశ్యామలం చేసేందుకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే సామర్థ్యంతో చేపట్టారు.
ఈ పథకం ద్వారా కూడా అత్యంత వెనకబడిన గట్టు ప్రాంతానికి సాగునీరు అందడం లేదు.
ఈ సమస్యను కూడా పరిష్కరించి మరో మినీఎత్తిపోతల ద్వారా గట్టుకు సాగునీటిని అందించాలన్న ప్రతిపాదన మేరకు ఇప్పటికే జూరాల అదికారులు ప్రాథమిక సర్వేచేసి నివేదికను ప్రభుత్వానికి పంపించారు. జూరాల అధికారుల నివేదిక ఆధారంగా సమగ్రసర్వేకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో కీలకమైన ఆర్థికశాఖ క్లియరెన్స్ రెండురోజుల క్రితం లభించినట్లు తెలిసింది. మరో రెండురోజుల్లో సమగ్రసర్వేకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించనున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది.
చెరువు, కుంటలకు జలకళ
ప్రాథమిక సర్వే వివరాల ప్రకారం నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండో పంప్‌హౌస్ వద్ద ఉన్న ర్యాలంపాడు రిజర్వాయర్‌కు పడమర వైపున ఆలూరు గ్రామ శివారులో రిజర్వాయర్ వద్ద ఇన్‌టెక్‌వెల్‌ను నిర్మిస్తారు. అక్కడ కేవలం 0.3 మెగావాట్‌ల విద్యుత్ వినియోగంతో నడిచే పంపింగ్ మోటారును ఏర్పాటుచేసి అక్కడి నుంచి గట్టు మండలలోని మల్లాపురం తండా పక్కన ఉన్న గజ్జెలమ్మగుట్టపైకి నీటిని పంపింగ్ చేస్తారు. గుట్టపై భూతల భాండాగారాన్ని నిర్మిస్తారు. ఇందులోకి వచ్చిన నీటిని మూడు వైపులకు వెళ్లే విధంగా చానల్స్‌ను ఏర్పాటుచేస్తారు. గుట్టపై నుంచి మండలంలోని చెరువులు, కుంటలకు నీళ్లను గ్రావిటీఫ్లో ద్వారా వెళ్లేవిధంగా కాల్వలను తవ్వుతారు. ఇలా మండలంలోని దాదాపు 30 నుంచి 40 చెరువుల కుంటలను నీటితో నింపుతారు. వీటితో పాటు లిప్టు ద్వారా అదనంగా 3500 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితే గట్టు మండలంలోని చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకుంటుంది.
గట్టు ఎత్తిపోతల పథకం సర్వేకు ప్రభుత్వ అనుమతి
Published Mon, Nov 25 2013 3:43 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
Advertisement