సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలికల్లో హరితహారాన్ని విజయవంతం చేయాలని ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. గురువారం హరితహారంపై అటవీ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జూలై రెండోవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా హరితహారం చేపట్టనున్నట్లు ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ అధికారి పీకే ఝా, హరితహారం కార్యక్రమ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ మంత్రికి తెలిపా రు. జూన్‌లో హరితహారంపై పెద్దఎత్తున ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు కేటీఆర్ సూచించారు. ముందుగా అన్నీ మున్సిపాలిటీల కమిషనర్లతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని సీడీఎంఏ శ్రీదేవిని మంత్రి ఆదేశించారు. మొక్కలునాటే స్థలాల ఎంపిక కోసం స్థానిక రెవెన్యూ సిబ్బంది సహకారం తీసుకోవాలన్నారు.
పార్కులు, ఖాళీ స్థలాల్లో మొక్కలు
హైదరాబాద్‌లో హరితహారాన్ని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలు విజయవంతం చేయాలని కేటీఆర్ అన్నారు. నగరంలోని పార్కులు, ఖాళీ స్థలాలను ఎంపిక చేయడంతోపాటు ఎన్ని మొక్కలు నాటాలనేదానిపై అంచనాకు రావాలని అధికారులకు సూచించారు. నగరంలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో జోనల్, సర్కిల్ వారీగా హరితహారంపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
పట్టణాల్లో ఏఏ ప్రాంతాల్లో మొక్కల పంపిణీ జరుగుతుందో ప్రజలకు తెలపడంతోపాటు డిసెంట్రలైజేషన్ పద్ధతిన మొక్కల పంపిణీకి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలోని చెరువుల చుట్టూ మొక్కలు నాటేందుకు సాగునీటి, రెవెన్యూ అధికారులతో కలసి పనిచేయాలని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించారు. హరితహారంతో చెరువులకు నేచురల్ ఫెన్సింగ్ వేసేలా మొక్కలను నాటాలన్నారు.
పట్టణాల్లోని శ్మశానవాటికల్లో మొక్కలు, డంప్‌యార్డుల్లో సువాసనలు వెదజల్లే మొక్కలు నాటాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు వంద పారిశ్రామికవాడల్లో హరితహారం అమలుపై ప్రత్యేకంగా చర్చించారు. కనీసం 30 శాతానికిపైగా పచ్చదనం ఉండాలన్న నిబంధన మేరకు ఆయా కంపెనీలు మొక్కలు నాటేలా చూడాలని, ఈ విషయంలో టీఎస్‌ఐఐసీ పూర్తి బాధ్యత తీసుకోవాలని ఎండీ వెంకటనర్సింహారెడ్డికి సూచించారు. సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, సీడీఎంఏ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఫారెస్ట్, టీఎస్‌ఐఐసీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment