సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట: త్వరలో మున్సిపాలిటీల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని, దీనికి కేబినెట్ ఆమోదం తెలిపిందని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. వచ్చే మూడేళ్లలో మున్సిపాలిటీల రూపురేఖలు మార్చే లా అధికారులు, నాయకులు పనిచేయాలని ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేట మున్సిపాలిటీని రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి సాధించాలన్నారు. మున్సిపల్ అభివృద్ధికి తాగునీరు, పరిశుభ్రత, పార్కులు, తడి, పొడి చెత్తల సేకరణ, పన్ను వసూళ్లు ఇలా మొత్తం 42 అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలని స్పష్టం చేశారు.
శుక్రవారం హైదరాబాద్‌లో మున్సిపాటీల అభివృద్ధి ప్రణాళికపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలసి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, గూడెం మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, ఒడితల సతీష్ కుమార్, పద్మా దేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్, భూపాల్‌రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, హన్మంతరావు, ధర్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లు పాల్గొన్నారు.
400 పాత బస్సులతో షీ టాయిలెట్స్
పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా మొదటి వారంలో నెలకు రూ. 12 వేల చొప్పున వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్ చొప్పున ఏర్పాటు చేయాలని, అందులో 50 శాతం షీ టాయిలెట్‌లు ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 400 పాత బస్సులు తీసుకొని షీ టాయిలెట్‌లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ఉదయం 5:30 గంటల నుంచే వార్డుల్లో పర్యటించాలని, అలా అయితేనే ప్రజల సమస్యలు తెలుస్తాయన్నారు. చెత్త సేకరణ మొక్కుబడిగా కాకుండా నూతన ఒరవడితో సేకరించాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి పట్టణమే కేంద్రమని, పట్టణంలో వచ్చే మార్పు నియోజకవర్గం మొత్తం ప్రభావితం చూపుతుందన్నారు.
పక్కాగా నీటి సౌకర్యం...
‘వాటర్ ఆడిట్‌లో భాగంగా మున్సిపాలిటీల్లో ఎంత నీరు ప్రజలకు సరఫరా చేస్తున్నాం, మన కు ఆ నీటికి సరిపడా బిల్లులు చెల్లిస్తున్నారా లేదా అని అంచనాలు తయారు చేయాలి. సింగపూర్ లాంటి దేశాల్లో 100 లీటర్ల నీటికి 90 లీటర్ల బిల్లు లు వస్తాయి. పది శాతం నీరు ట్రాన్సిట్ లాస్ అవుతుంది. మన దగ్గర 100 లీటర్ల నీటికి 60 లీటర్లకు కూడా బిల్లులు రావడం లేదు. ఈ పరి స్థితి మారాలి. ప్రజలకు మంచి నీటి సౌకర్యం పక్కాగా, ప్రణాళికాబద్ధంగా అందిస్తే బిల్లులు చెల్లించడానికి వెనుకాడరు. తెల్ల కార్డుదారులకు రూపాయికే, మిగతా వారికి రూ. 100కి నల్లా కనెక్షన్ ఇవ్వాలి’అని కేటీఆర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment