సాక్షి, హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేల ప్రకారం కాంగ్రెస్ కంటే టీఆర్‌ఎస్ ఎంతో ముందంజలో ఉందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నిక ప్రచారం తీరుతెన్నులపై పార్టీ ఇన్‌చార్జిలు, సీనియర్ నేతలతో శనివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ ఇన్‌చార్జిలతో పాటు, ఇతర నేతల నుంచి ప్రచారం జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇంటింటికీ పార్టీ ప్రచారం చేరాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు.. ప్రజల నుంచి టీఆర్‌ఎస్‌కు అనూహ్య మద్దతు లభిస్తోందని, పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో కనీసం 50 శాతం ఓట్లు టీఆర్‌ఎస్ అభ్యర్థికి అనుకూలంగా పోలవుతాయని కేటీఆర్ వెల్లడించారు. గత ఎన్నికల్లో పార్టీ ఎన్నికల చిహ్నం కారును పోలివున్న ట్రక్కు గుర్తుతో టీఆర్‌ఎస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ కొన్ని వాహనాలకు సంబంధించిన ఇతర గుర్తులు ఉన్నందున.. పార్టీ చిహ్నాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డమ్మీ ఈవీఎంలు ఉపయోగించాలని పార్టీ నేతలకు సూచించారు.
కాంగ్రెస్‌కు ప్రచారాంశాలు కరువు..
‘టీఆర్‌ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్‌కు లాభం’ నినాదంతో చేస్తున్న ప్రచారానికి ప్రజల మద్దతు లభిస్తోందని, అదే సమయంలో కాంగ్రెస్‌కు ప్రచారాంశాలు లేకుండా పోయాయని పార్టీ నేతలతో కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో లేకున్నా.. కేంద్ర నిధులతో హుజూర్‌నగర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి చేస్తున్న ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత లేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుత ఉప ఎన్నికతో బీజేపీ బలం తేలిపోతుందని, డిపాజిట్ దక్కితే అదే వారికి అతిపెద్ద ఉపశమనమన్నారు. ప్రజాభిమానం పొందలేని బీజేపీ.. కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరిస్తూ దొంగ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
హుజూర్‌నగర్ ప్రచారానికి కేటీఆర్ దూరం..?
దసరా తర్వాత హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో కేటీఆర్ పాల్గొంటారని పార్టీ వర్గాలు తొలుత వెల్లడించాయి. నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత ఈ నెల 4న హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొన్నారు. తిరిగి ఈ నెల 10 నుంచి నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్‌షోలలో పాల్గొంటారని ప్రచారం జరగ్గా.. చివరి నిమిషంలో పర్యటన షెడ్యూల్ రద్దయింది. కాగా, హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో కేటీఆర్ పాల్గొనే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడిం చాయి. ఈ నెల 19న ఉప ఎన్నిక ప్రచారం ముగియనుండగా.. సీఎం కేసీఆర్ ఈ నెల 18న జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. అయితే సీఎం కేసీఆర్ ప్రచారానికి సంబంధించి ఇప్పటివరకు షెడ్యూల్ ఖరారు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment