దమ్ముంటే బీజేపీ డిపాజిట్ తెచ్చుకోవాలి : కేటీఆర్
దౌల్తాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావులకు దమ్ముంటే మెదక్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి డిపాజిట్ తెచ్చుకోవాలని మంత్రి కె. తారకరామారావు సవాల్ విసిరారు. ఆదివారం మెదక్ జిల్లా దౌల్తాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. పచ్చి సమైక్యవాది అయిన జగ్గారెడ్డికి టికెట్ ఇవ్వడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
90రోజుల్లోనే 80సమస్యల పరిష్కారానికి నిర్ణయం తీసుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం చరిత్రకెక్కిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు చెప్పుకోవడానికి ఏమీలేకపోవడంతో టీఆర్‌ఎస్‌పై దుష్ర్పచారం చేయడం మొదలుపెట్టారన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాల వల్లనే తెలంగాణలో కరెంట్ కష్టాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తెలంగాణ కోసం ఏనాడూ పాటుపడలేదని విమర్శించారు.
టీఆర్‌ఎస్ పార్టీలో భారీగా చేరికలు
చేగుంట: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఆదివారం మెదక్ జిల్లా చేగుంటలో ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా తండాలున్నాయని, 500 జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా గుర్తిస్తామన్నారు.