'తప్పు ఎవరు చేసినా చర్యలు తప్పవు'
హైదరాబాద్: తెలంగాణ సిద్దాంతకర్త, ప్రొ కె.జయశంకర్ ఆశయాలకనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కే తారక రామారావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ 4వ వర్ధంతి వేడుకలను ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి కేటీఆర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ..వరంగల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లాకు జయశంకర్ పేరుపెడతామన్నారు. జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఇప్పటికే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ పేరు పెట్టామన్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో..తప్పు ఎవరు చేసినా చర్యలు తప్పవన్నారు. చట్ట ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.