తుపాకుల స్వాతి , కేటీఆర్ పెట్టిన ట్వీట్
ఖమ్మం, నేలకొండపల్లి: ఓ ప్రమాదం కారణంగా మహిళకు రెండు చేతులు పని చేయడం లేదు. ఒక కాలు సగం వరకు తీసేశారు. వారి గోడును ఓ ట్రస్టు సభ్యుడు కేటీఆర్‌కు ట్విటర్‌లో వివరాలను తెలిపాడు. స్పందించిన మంత్రి కేటీఆర్ వైద్య ఖర్చుల కోసం రూ.లక్షను మంజూరు చేశారు. వివరాలిలా ఉన్నాయి. నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన తుపాకుల స్వాతి 9 నెలల కిందట విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమెకు రెండు చేతులు చచ్చుబడ్డాయి. నిరుపేద కుటంబం కావడంతో కష్టాలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న నేలకొండపల్లి వెల్ఫేర్ డెవలప్‌మెంట్ ట్రస్టు సభ్యుడు శ్రావణ్ విషయాన్ని రెండు రోజుల కిందట మంత్రి కేటీఆర్‌కు ట్విటర్ ద్వారా తెలిపాడు. కేటీఆర్ స్పందించి సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.లక్ష మంజూరు చేయించారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సదరు యువకుడికి శుక్రవారం ఫోన్ వచ్చింది. మహిళకు వైద్యం చేయించేందుకు రూ.లక్ష మంజూరు చేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లో హైదరాబాద్‌లోని వి.కేర్ వైద్యశాలలో చేర్పించాలని సూచించారు. కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన శ్రావణ్‌ను పలువురు అభినందించారు. స్వాతి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.
హైదరాబాద్‌కు చికిత్స కోసం వెళ్లేందుకు బాధిత మహిళకు ఆర్థిక సాయం చేయాలని సమాచార హక్కు రక్షణ చట్టం సభ్యుడు, స్థానిక ఎమ్మేల్యే కందాల ఉపేందర్‌రెడ్డిని కలిసి కోరారు. వెంటనే కొంత ఆర్థిక సాయం చేశారు. ఆమెకు పింఛన్ అందించాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పసుమర్తి శ్రీనివాస్, గండికోట వెంకటలక్ష్మి, వున్నం బ్రహ్మయ్య, కోటి సైదారెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment