
ప్రగతిభవన్‌లో ఆదివారం పూలకుండీల్లో నిండిన నీటిని తొలగిస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సీజనల్ వ్యాధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులు విజృంభించే అవకాశముందని, వీటికి ప్రధాన కారణమైన దోమలను అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దోమలు ఇళ్లలో పేరుకుపోయిన మంచినీళ్లపై వేగంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
పారిశుద్ధ్యాన్ని పెంచడం ద్వారా సీజనల్ వ్యాధులను నిర్మూలించేందుకు తలపెట్టిన ‘ప్రతి ఆదివారం–10 గంటలకు 10 నిమిషాలు’అనే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వరుసగా రెండోవారం పాల్గొని ప్రగతి భవన్‌లోని తన నివాసంతో పాటు, పరిసరాలను పరిశీలించారు. తాజాగా కురిసిన వర్షాలకు పలు పాత్రల్లో నిండిన నీటిని ఖాళీ చేయడంతో పాటు వివిధ ప్రాంతాల్లో పేరుకుపోయిన వాన నీటిని సైతం తొలగించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలకు అదనంగా ప్రతి ఒక్కరు తమ ఇళ్లతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు తమ ఇంటి పరిశుభ్రత, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కేటాయించాలని తద్వారా ప్రస్తుత వర్షాకాలంలో వచ్చే అన్ని రకాల సీజనల్ వ్యాధులను అరికట్టే అవకాశం కలుగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment