కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో...
- 2,33,782 మంది విద్యార్థులు
- 153 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, ఫైనల్ ఇయర్ పరీక్షలు ఈనెల 18వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ మేరకు పరీక్షల నియంత్రణ అధికారులు మూడు జిల్లాలో మొత్తం 153 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో 60, ఖమ్మం జిల్లాలో 46 , ఆదిలాబాద్ జిల్లాలో 47 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, పరీక్షలకు మొత్తం 2,33,782 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఇందులో బీఏ ఫస్టియర్‌లో 19,671, సెకండియర్‌లో 13,874, ఫైనల్ ఇయర్‌లో 10,292 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అలాగే బీకాం ఫస్టియర్‌లో 31,182 మంది, సెకండియర్‌లో 26,717 మంది, ఫైనల్ ఇయర్‌లో 21,575, బీఎస్సీ ఫస్టియర్‌లో 43,182, సెకండియర్‌లో 36,527, ఫైనల్‌ఇయర్‌లో 29,707, బీబీఎం ఫస్టియర్‌లో 377, సెకండియర్‌లో 353, ఫైనల్ ఇయర్‌లో 325 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. కాగా, డిగ్రీ సెకండియర్, ఫైనల్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి.
అలాగే మొదటి సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎంవీ రంగారావు, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి. వెంకట్రామ్‌రెడ్డి బుధవారం వెల్లడించారు. ఈనెల 18నుంచి ఏప్రిల్ 18వతేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు చెప్పారు. ఫస్టియర్, ఫైనల్‌ఇయర్ పరీక్షలు ఒకే రోజు ఉంటాయని, మరుసటి రోజు ద్వితీయ సంవత్సరం పరీక్షలు టైంటేబుల్ ప్రకారం జరుగుతాయని వారు పేర్కొన్నారు.