
తిరుకల్యాణ మహోత్సవం
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి, అమ్మవారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి 11 గంటల 25 నిమిషాలకు తులాలగ్న పుష్కరాంశ సుముహూర్తమున యాదగిరి నర సింహస్వామి, లక్ష్మీ అమ్మవారు ఒక్కటయ్యారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్లను హనుమంత వాహనసేవపై ఆలయ తిరువీధులలో బాజా భజంత్రీలు, ఆలయ అర్చకుల వేదమంత్రాల నడుమ ఊరేగించారు.
రాత్రి స్వామి, అమ్మవార్లను పెళ్లికూతురు, పెళ్లికుమారుడిగా ముస్తా బు చేసి పలు పుష్పాలతో అలంకరించారు. ప్రభుత్వం తరఫున గవర్నర్ నరసింహన్ దంపతులు.. దేవస్థానం తరఫున దేవస్థానం చైర్మన్ బి.నరసింహమూర్తి అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలను, సీఎం సమర్పించిన పట్టువస్త్రాలను కల్యాణ మండపానికి తీసుకువచ్చారు.
అర్చకులు, వేద పండితులు, రుత్వికుల వేద పఠనంతో, వేద మంత్రోచ్ఛరణల మధ్య రాత్రి స్వామి, అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం పెట్టారు. యజ్ఞోపవీతధారణ చేశారు. అనంతరం కన్యాదానం, మాంగల్యధారణచేసి తలంబ్రాలను పోయించారు. కల్యాణంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, గుట్ట అభివృద్ధి మండలి ప్రత్యేక అధికారి కిషన్‌రావు, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రభాకర్‌రావు దంపతులు పాల్గొన్నారు.