చింతమడక నుంచే భూ పంపిణీ! | Land distribution program starts from chintamadaka | Sakshi
Sakshi News home page

చింతమడక నుంచే భూ పంపిణీ!

Published Wed, Jul 30 2014 1:22 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM

చింతమడక నుంచే భూ పంపిణీ! - Sakshi

చింతమడక నుంచే భూ పంపిణీ!

సిద్దిపేట రూరల్: దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15న చింతమడక నుంచి ప్రారంభిస్తున్నట్లు భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన సిద్దిపేట మండలం నారాయణరావుపేట శివారులోని శ్రీ బుగ్గరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఆలయ సమీపంలో సామూహిక మండపం నిర్మాణానికి, బంజేర్‌పల్లి పాఠశాల భవనం ప్రారంభోత్సవంతో పాటు అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, మాచాపూర్, చింతమడక గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.
 
వృద్ధులు, వితంతు, వికలాంగులకు దసరా నుంచి పింఛను డబ్బులను పెంచనున్నట్లు తెలిపారు.  అంతకు ముందు బంజేర్‌పల్లి పాఠశాలలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి లింగారెడ్డిపల్లి గ్రామానికి వెళ్లి సర్పంచ్ రామస్వామిని పరామర్శించారు.  కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర యాదయ్య, జెడ్పీటీసీ గ్యార వజ్రవ్వ యాదగిరి, సర్పంచ్‌లు కృష్ణవేణి వెంకట్‌రెడ్డి, భూమయ్య, ఎర్రోళ్ల లక్ష్మి శేఖర్, ఎంపీటీసీలు రోమాల శాంత రాజయ్య, చెప్యాల దేవవ్వ రాజయ్య, నాయకులు బాలకిషన్‌రావు, సత్యనారాయణగౌడ్, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
ప్రతి రోజూ సిద్దిపేటకు మంచినీటి సరఫరా
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట పట్టణానికి ప్రతి రోజు తాగునీరందించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించాలని మంత్రి హరీష్‌రావు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాల్టీలోని 34 వార్డులకు ప్రతి రోజు తాగునీరందించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ కోసం సూచనలను, సలహాలను అందజేశారు.
 
నీటి సరఫరా సమయంలో లీకేజీలను అరికట్టేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. నీటి వృధాపై ప్రజల్ని చైతన్య పరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. వినియోగదారులు నల్లాలకు బిరడాలను బిగించకపోవడంతో నీరంతా వృధాగా పోతోందన్నారు. ప్రతి రోజు ఒక్కో కనెక్షన్‌పై రూ. 100ల విద్యుత్తును ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు.  రోజు అరగంట పాటు నీటి సరఫరాతో పట్టణంలోని ప్రతి ఇంటికి మంచినీరు అందించవచ్చన్నారు. ప్రతి ఇంటికి నల్లా పెట్టించాలని, తాగునీటిని తోడుతున్న మోటార్లను స్వాధీనం చేసుకోవాలని, అనధికార నల్లాలను నిరోధించాలని, కమర్షియల్ భవనాలకు నల్లా కనెక్షన్ రేటు పెంచాలని, పవర్ బోర్లపై వస్తున్న విద్యుత్ బిల్లులను తగ్గించుకునేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.
 
ప్రతి రోజు నీరందించే పట్టణంగా సిద్దిపేటను రూపొందించడమే తన లక్ష్యమన్నారు.  ఇందుకు తొమ్మిది మంది అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  సిద్దిపేట ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, డీఎస్పీ, ఎంఈవో, ఎంపీడీఓ, ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్, తహశీల్దార్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ 34 వార్డుల్లో  వార్డు కమిటీలను నియమించి ప్రతి వార్డుకు ఒక్కో అధికారి స్పెషల్ ఆఫీసర్‌గా కొనసాగుతారన్నారు.
 
పట్టణంలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలతో కమిటీ త్వరలో సమావేశం ఏర్పాటు చేసి ఆయా వార్డుల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి నీటి వృధాపై ప్రజల్ని చైతన్య పరుస్తుందన్నారు.   సమావేశంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, ఎంఈవో నాగరాజు, ఎంపీడీఓ బాల్‌రాజు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి శ్రీనివాసచారి, పీఆర్ అధికారి కనకరత్నం, తహశీల్దార్ ఎన్‌వైగిరి తదితరులు పాల్గొన్నారు.
 
రంజాన్ ఏర్పాట్లు భేష్
రంజాన్ పండుగ నిర్వహణకు అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలో రంజాన్ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు. ఉత్సవాల్లో మంత్రి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ  టీఆర్‌ఎస్ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తోందన్నారు.  
 
సిద్దిపేటలో హజ్ హౌస్ నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు మచ్చవేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, పాలసాయిరాం, మోహన్‌లాల్, నర్సింహారెడ్డి, నాయకం వెంకట్, మల్లేశం, యోగి, బాలకిషన్ రావు, కాముని నగేష్, నందు, రమేష్‌గౌడ్, లక్కరసు ప్రభాకర్ వర్మ, సికిందర్,అక్బర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement