![‘క్రమబద్ధీకరణ’కు భారీగా దరఖాస్తులు](/styles/webp/s3/article_images/2017/09/4/81466983958_625x300.jpg.webp?itok=A2AoIGcv)
‘క్రమబద్ధీకరణ’కు భారీగా దరఖాస్తులు
► రెవెన్యూ శాఖకు అందిన ఆరు వేల దరఖాస్తులు
► చివరి రోజున ఆధార్ కార్డు మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: పట్టణ భూపరిమితి(యూఎల్సీ) చట్టం కింద ఖాళీస్థలాల క్రమబద్ధీకరణకు పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. యూఎల్సీ భూములున్న ప్రాంతాల నుంచి దరఖాస్తు సమర్పణకు చివరి గడువు (శనివారం) నాటికి సుమారు ఆరు వేల దరఖాస్తులు అందినట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. గరిష్టంగా రంగారెడ్డి జిల్లాలో 5,600 దరఖాస్తులు రాగా, హైదరాబాద్ జిల్లాలో 300, వరంగల్ జిల్లా నుంచి సుమారు వంద దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. యూఎల్సీ ఖాళీస్థలాలను చెల్లింపు కేటగిరీ కింద క్రమబద్ధీకరించాలని గత నెల 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో పలు జీవోల ద్వారా యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణ/ కేటాయింపు అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం, తాజా ఉత్తర్వుల మేరకు మండల తహసీల్దార్ స్థాయిలోనే ఆ ప్రక్రియను పూర్తిచేసే వెసులుబాటును కల్పించింది.
క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం కృషి ఫలితంగా యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ క్రమేపీ ఊపందుకుంది. అయితే.. ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న మేరకు ఈ నెల 25తో దరఖాస్తు గడువు ముగిసింది. మరో వారం రోజులు గడువు పొడిగించిన పక్షంలో మరో రెండు వేల దరఖాస్తులు వచ్చే అవ కాశం ఉందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఒకసారి డిక్లరెంట్ నుంచి కొనుగోలు చేసిన స్థలాలకు తిరిగి ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాల్సి రావడం పట్ల స్థలాల యజమానులు తొలుత భారంగా భావించినా, సదరు ఆస్థిపై హక్కులు వస్తాయి కదాని చివరి వారంలో దరఖాస్తు చేసేందుకు మొగ్గుచూపారని చెబుతున్నారు. హైదరాబాద్ శివారుల్లో ఈ తరహా భూములు కొన్న కొందరు ప్రస్తుతం ఉద్యోగ, వ్యాపార రీత్యా పొరుగు రాష్ట్రాల్లో ఉండడం, మరికొందరు ఇతర దేశాల్లో ఉన్నందున క్రమబద్ధీకరణ సమాచారం అందకపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఆలస్యంగా స్పందించిన అధికారులు..
యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియలో తొలి నుంచి ఆధార్ నంబరును భూపరిపాలన విభాగం అధికారులు తప్పనిసరి చేయడంతో ఆధార్ కార్డులేని వారు దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఖాళీస్థలాలు కొనుగోలు చేసిన వారిలో స్థానికంగా ఉండేవారితో పాటు ఇతర దేశాల్లో ఉంటున్న పలువురికి ఆధార్ కార్డులు లేకపోవడంతో వారంతా దరఖాస్తులు సమర్పించలేకపోయారు. ఈ తరహా దరఖాస్తులు ఎక్కువగా రావడం, మీ సేవా కేంద్రాల్లో వాటిని తిరస్కరించడంపై సీసీఎల్‌ఏ అధికారులు ఆలస్యంగా స్పందించారు. దరఖాస్తు సమర్పణకు ఆఖరు రోజున మాత్రమే ఆధార్ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ సమాచారం ఎక్కువమందికి చేరలేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మరో వారం రోజులు గడువిస్తే, పూర్తిస్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. ఒక వేళ దరఖాస్తు స్వీకరించని పక్షంలో సదరు స్థలాల యజమానుల నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా స్థలాలను స్వాధీన పరచుకోలేని పరిస్థితి ఉన్నందున గడువు పెంచడమే మేలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గడువు పెంపుతో పాటు.. క్రమబద్ధీకరణ కోసం చెల్లించాల్సిన ధరను ఇంకాస్త తగ్గించినట్లయితే ఎక్కువమందికి మేలు చేకూరుతుంద ని, ప్రస్తుత ధర కాకుండా సదరు స్థలాలను కొనుగోలు చేసిన తేదీనాటి బేసిక్ విలువలను పరిగణనలోకి తీసుకోవాలని యజమానులు కోరుతున్నారు.