
సాక్షి, హైదరాబాద్ : కొత్త సంవత్సర వేడుకల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఏరులైపారింది. మందుబాబులు ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ఏకంగా రూ.200 కోట్లకుపైగా విలువైన మద్యాన్ని తాగేశారు. ఎక్సైజ్ శాఖ ప్రాథమిక లెక్కల ప్రకారం డిసెంబర్ 31 ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా రూ.207.7 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ ఒక్క నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.1,700 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో పాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వాటాయే 600 కోట్లు దాటడం గమనార్హం.
‘గ్రేటర్’పరిధిలోనే రూ.125 కోట్ల విక్రయాలు
నూతన సంవత్సర వేడుకల్లో గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల పరిధిలోనే ఏకంగా రూ. 125 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అంచనా. పాత రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పాటు గ్రేటర్‌లోకి వచ్చే ఇతర జిల్లాల ప్రాంతాల్లో కలిపి ఈ విక్రయాల అంచనా వేశారు. ఇక వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రూ.20 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయి. ఇక డిసెంబర్ నెల మొత్తంగా చూసినా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్) ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఒక్క నెలలోనే రూ.1,700 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో పాత రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోనే రూ.602 కోట్ల అమ్మకాలు ఉండడం గమనార్హం.
భాగ్యనగరంలో ఫుల్ జోష్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారి నూతన సంవత్సర వేడుకలు ‘ఫుల్’జోష్‌తో జరిగాయి. హైదరాబాద్ పరిధిలోని 542 బార్లు, పబ్‌లు, 300 మద్యం దుకాణాలు, 134 ఈవెంట్లలో మద్యం పొంగిపొర్లింది. కొత్త ఏడాది వేడుకల్లో గతసారి రూ. 100 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరగగా.. ఈసారి రూ.125 కోట్లకుపైగా నమోదయ్యాయి. నగరవ్యాప్తంగా సుమారు 7 లక్షల కాటన్ల (ఒక్కో కాటన్‌లో 12 సీసాలు) బీర్లు, మరో ఐదు లక్షల కాటన్ల మేర ఐఎంఎల్ మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మద్యం ధరలు పెరిగినా కూడా అమ్మకాలు పెరగడం గమనార్హం.
2,499 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు
పోలీసులు ఆదివారం రాత్రి హైదరాబాద్ వ్యాప్తంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లలో 2,499 మంది పట్టుబడ్డారు. టోలిచౌకి పరిధిలో ఉన్న బాపూఘాట్ వద్ద, నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంతంలో జరిగిన తనిఖీల్లో అత్యధికంగా 145 మంది చొప్పున ‘డ్రంకెన్’డ్రైవర్లు చిక్కారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ట్రైడెంట్ ఆస్పత్రి వద్ద ఓ ఫార్చునర్ కారు డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా.. బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 347 నమోదవడం గమనార్హం. ఇక మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కినవారిలో బుల్లితెర యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వద్ద నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో అర్ధరాత్రి 2.50 గంటల సమయంలో పోలీసులు ప్రదీప్ కారును ఆపారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్ (బీఏసీ) 178గా నమోదైంది.
సాధారణంగా 35 బీఏసీ దాటితేనే పరిమితికి మించి మద్యం తాగినట్లు పరిగణిస్తారు. దీంతో పోలీసులు ప్రదీప్ బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. కాగా మద్యం తాగి వాహనాలు నడిపినవారి నుంచి 1,310 బైక్‌లు, 276 కార్లు, ఇతర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారికి మంగళ–బుధవారాల్లో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి.. న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు. సాధారణంగా బీఏసీ స్థాయి 35 నుంచి 150 పాయింట్ల వరకు ఉంటే కేసులు, జరిమానాలతో సరిపెడతారు. 150 పాయింట్లు దాటితే మాత్రం రెండు రోజుల నుంచి 10 రోజుల వరకు
జైలుశిక్ష విధించే అవకాశముంది.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన యాంకర్ ప్రదీప్
రాత్రి 2.45 గంటల వరకు మెట్రో జర్నీ
హైదరాబాద్ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నవారికి సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ఆదివారం రాత్రి 2.45 గంటల వరకు మెట్రో రైళ్లను నడిపారు. రోజు మొత్తంగా 1.07 లక్షల మంది మెట్రో ప్రయాణం చేయగా.. అందులో అర్ధరాత్రి దాటిన ప్రయాణించినవారు 6 వేల మందికిపైగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆర్టీసీ కూడా ప్రధాన మార్గాల్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు బస్సులు నడిపింది.
ఒక్కరోజు కిక్కు 200 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment