56 రోజులు.. రూ.3,800 కోట్లు! | Liquor Sales in 56 days is 3800 crores | Sakshi
Sakshi News home page

56 రోజులు.. రూ.3,800 కోట్లు!

Published Sat, Jul 4 2020 6:02 AM | Last Updated on Sat, Jul 4 2020 11:43 AM

Liquor Sales in 56 days is 3800 crores - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు లిక్కర్‌ అమ్మకాలు కాసుల పంట పండిస్తున్నాయి. గత రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.3,800 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ ఉపసంహరణ అనంతరం మే 6వ తేదీ నుంచి రాష్ట్రంలో మద్యం విక్రయాలు ప్రారంభం కాగా, ఆ నెలలో రూ.1,864 కోట్లు, జూన్‌ మాసం మొత్తంలో రూ.1,955 కోట్ల విలువైన బీర్లు, లిక్కర్‌ కేసులను వైన్స్‌ యజమానులు మద్యం డిపోల నుంచి కొనుగోలు చేశారు. అయితే, మే నెలతో పోలిస్తే జూన్‌ నెలలో కొంత కిక్కు తగ్గినట్టు కనిపిస్తున్నా పెద్దగా ప్రభావం చూపలేదు. జూన్‌ రెండో సగ భాగంలో షాపుల లైసెన్సు ఫీజులు కట్టాల్సి రావడంతో డబ్బులు సర్దుబాటు కాక వైన్స్‌ యజమానులు స్టాక్‌ పెట్టుకునేందుకు తంటాలు పడాల్సి వచ్చింది. కానీ, మళ్లీ రాష్ట్రంలో, ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారంతో జూన్‌ మాసంలో చివరి మూడ్రోజులు డిపోల నుంచి మద్యం విక్రయాలు పెరిగాయి. మొత్తం మీద ఈ రెండు నెలల మద్యం అమ్మకాల ద్వారా రూ.3,000 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరినట్టైంది. 

పెరిగిన బీర్ల అమ్మకాలు.. 
వాస్తవానికి ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. మరీ ముఖ్యంగా మే నెలలో ఈ అమ్మకాలు భారీ స్థాయిలో ఉంటాయి. కానీ, ఈసారి అందుకు భిన్నంగా మే కంటే జూన్‌ నెలలో బీర్ల అమ్మకాలు బాగా జరిగాయని డిపోల నుంచి వెళ్లిన బీర్‌ కేసుల లెక్కలు చెబుతున్నాయి. మే నెలలో 26 రోజుల అమ్మకాలకు గాను 23 లక్షలకు పైగా బీర్‌ కేసులు అమ్ముడుపోగా, జూన్‌లో 30 రోజులకు గాను 28.67 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. అయితే, అదే స్థాయిలో లిక్కర్‌ అమ్మకాల్లో మార్పు రాలేదు. మే నెల కంటే కేవలం 1.70 లక్షల కేసులు ఎక్కువ మద్యం అమ్ముడైంది. మే నెలలో రూ.26 లక్షలకు పైగా మద్యం కేసులు అమ్ముడవగా, జూన్‌లో దాదాపు 28 లక్షల కేసులే అమ్ముడుపోయాయి. మే నెల కంటే నాలుగు రోజులు ఎక్కువ సమయం జూన్‌లో దొరకడం, మద్యం విక్రయించే వేళలు కూడా జూన్‌ నెలలో పెరిగినా లిక్కర్‌ అమ్మకాల్లో మార్పు రాకపోవడం గమనార్హం. ఈ లెక్కన రాష్ట్రంలో మేతో పోలిస్తే జూన్‌ నెలలో లిక్కర్‌ అమ్మకాలు కొంత తగ్గినట్టేనని ఎక్సైజ్‌ శాఖ‌ అధికారులు చెపుతున్నారు.

మొదటి సగం ‘ఫుల్లు’! 
జూన్‌ నెలలో అమ్మకాలు మొదట్లో బాగానే కనిపించాయి. ఈ రెండు నెలల్లో కలిపి రోజుకు సగటున రూ.68 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరగ్గా, జూన్‌ నెల ప్రథమార్ధంలో మాత్రం అది సగటున రూ.77 కోట్ల వరకు వచ్చింది. జూన్‌ 1 నుంచి 15 మధ్య ఏకంగా రూ.1,153 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్‌షాపులకు చేరింది. అందులో 15 లక్షలకు పైగా కేసుల బీర్లు, 13.45 లక్షల కేసుల లిక్కర్‌ అమ్ముడైంది. ఆ తర్వాత 15 రోజుల్లో కలిపి కేవలం రూ.800 కోట్ల విలువైన బీర్లు, లిక్కర్‌ అమ్మకాలే జరిగాయి. అంటే జూన్‌ చివరి 15 రోజుల్లో రాష్ట్రంలో రోజుకు సగటున రూ.53 కోట్ల మద్యం విక్రయాలే జరిగాయన్న మాట. ఇందుకు వైన్‌షాపు యజమానులు స్టాక్‌ పెట్టేందుకు వెనుకాడటమే కారణమని ఎక్సైజ్‌ శాఖ వర్గాలంటున్నాయి. ఈ నెలలోనే 3 నెలల లైసెన్సు ఫీజు చెల్లించే వాయిదా ఉండటంతో పెద్ద మొత్తంలో డబ్బులు సర్దుబాటు చేయాల్సి వచ్చిందని, అందుకే ఈ నెలాఖరులో పెద్దగా స్టాక్‌ పెట్టుకోలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ, మళ్లీ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తారేమోననే అంచనాతో చివరి మూడ్రోజులు పెద్ద ఎత్తున స్టాక్‌ను తరలించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement