
సాక్షి, హైదరాబాద్: కరోనా పుణ్యమా అని విధించిన లాక్‌డౌన్ కారణంగా గృహోపకరణాల (ఎలక్ట్రానిక్ వస్తువులు) మరమ్మతులకు తీవ్ర జాప్యం నెలకొనేలా కనిపిస్తోంది. ప్రతీ వ్యక్తికి సాధారణ అవసరాలుగా మారిన ఫ్రిజ్, టీవీ, మొబైల్ ఫోన్లు లక్షలాదిగా రిపేర్ల కోసం ఎదురుచూస్తున్నాయి.దేశవ్యాప్తంగా అన్ని ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్స్ సర్వీసుసెంటర్లు మూతపడటమే ఇందుకు కారణం. మార్చి 25 నుంచి ఇప్పటి దాకా దేశంలో లక్షన్నర ఫ్రిజ్‌లు, లక్షకుపైగా టీవీలు, కోటి వరకు మొబైల్‌ఫోన్లు రిపేర్లు లేక మూలనపడ్డాయట. ఈ విషయం సెల్యూలార్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగదారులు, తయారీదారుల సంఘ సంయుక్త సర్వేలో వెల్లడైంది.
కాలక్షేపానికీ కష్టకాలం..
కరోనా కట్టడిలో భాగంగా అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కాలక్షేపానికి కనిపించిన ప్రతీసీరియల్‌ను, సినిమాను వదలకుండా చూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడంతో అందరూ చూసిన ప్రోగ్రాములను మళ్లీ చూస్తున్నారు. అలాంటి చాలా ఇళ్లల్లో టీవీలు పాడయ్యాయి. దీనికితోడు లక్షన్నర వరకు రిఫ్రిజిరేటర్లు, అరవై వేల వరకు ఏసీలు చెడిపోయాయి. స్మార్ట్‌పోన్లు, ఇతర మొబైల్ ఫోన్లు అన్నీ కలిపి సుమారుగా కోటి వరకు పాడై ఉంటాయని సర్వే అంచనా వేస్తోంది.
ఉపాధి లేని మెకానిక్‌లు..
లాక్‌డౌన్‌తో దేశంలోని చాలా ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్స్ సేల్స్ – సర్వీసు రంగం తీవ్రంగా నష్టపోయింది. విక్రయాల మాట ఎలా ఉన్నా.. సర్వీసింగ్ చేసేందుకూ అనుమతి లేకపోవడంతో చిరు మెకానిక్‌లకు పూటగడవడమే కష్టంగా మారిందని వాపోతున్నారు. కొన్ని గృహోపకరణాల సంస్థలు మాత్రం ఫోన్‌లో సంప్రదిస్తే.. చిన్న మరమ్మతులకు సలహాలు సూచనలు ఇస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment