బతుకు బండి కదిలింది | Lockdown Relaxations Bustling Again In The Metropolitan Hyderabad | Sakshi
Sakshi News home page

బతుకు బండి కదిలింది

Published Wed, May 20 2020 3:11 AM | Last Updated on Wed, May 20 2020 3:11 AM

Lockdown Relaxations Bustling Again In The Metropolitan Hyderabad - Sakshi

మంగళవారం రామ్‌కోఠిలో ఓ దుకాణం ముందు టూ వీలర్‌ను రిపేర్‌ చేçస్తున్న మెకానిక్‌

సాక్షి, హైదరాబాద్‌: సుదీర్ఘమైన లాక్‌డౌన్‌ తర్వాత మహానగరంలో బతుకు బండి కదిలింది. సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్‌మాల్స్‌ మినహా అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు మొదలయ్యాయి. మెకానిక్‌ షాపుల మొదలు చెప్పుల దుకాణాల వరకు అన్నీ తెరుచుకున్నాయి. ఆటోలు, ట్యాక్సీలు, తదితర వాహనాలన్నీ రోడ్డెక్కాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సుల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

లాక్‌డౌన్‌తో 2 నెలలుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు రోడ్లపైకి వచ్చారు. వ్యాపార కార్యకలాపాలు నెమ్మదిగా మొదలయ్యాయి. లాక్‌డౌన్‌ దృష్ట్యా మందుల షాపులు, కిరాణా షాపులు, పాలు, పండ్లు, కూరగాయలు వంటి వాటికే అనుమతిచ్చారు. ఆ తర్వాత రెండోదశలో నిర్మాణ రంగానికి చెందిన వస్తు విక్రయాలకు సడలింపు లభిం చింది. వైన్స్‌ సైతం తెరుచుకున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ షాపులు, ఆటోమొబైల్‌ షోరూంలకు అనుమతిచ్చారు.

తాజాగా ప్రజలు ఎక్కువగా గుమి గూడేందుకు అవకాశం ఉన్న మాల్స్, సినిమా హాల్స్, హోటళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు మినహా అన్నింటికీ అనుమతివ్వడంతో వస్త్ర దుకాణాలు సహా అన్నీ తెరుచుకున్నాయి. వివిధ అవసరాల కోసం జనం పెద్ద ఎత్తున బయట కొచ్చారు. ఆటోలు, క్యాబ్‌లు సైతం అందుబాటులోకి రావడంతో ప్రజా రవాణా సదుపాయాలు సైతం పాక్షికంగా అందుబాటులోకి వచ్చినట్లయింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్‌లపై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

మెహిదీపట్నంలో రోడ్డెక్కిన ఆటో..

గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 1.4 లక్షల ఆటోలు రోడ్డెక్కాయి. అలాగే ఉబర్, ఓలా, తదితర సంస్థలకు చెందిన క్యాబ్‌లు, ట్యాక్సీలు సైతం అందుబాటులోకి వచ్చాయి. మొదటి రోజు సుమారు 26 వేలకు పైగా వాహనాలు రోడ్డెక్కినట్లు తెలంగాణ క్యాబ్‌డ్రైవర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. ఐటీ కారిడార్లలో ఈ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ క్యాబ్‌ అగ్రిగేటర్లు డ్రైవర్ల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, వాహనాలు నడపడంలో ఇబ్బందిగా ఉందని అసోసియేషన్‌ ప్రతినిధి షేక్‌ సలావుద్దీన్‌ తెలిపారు. మరోవైపు ట్యాక్సీలు, క్యాబ్‌లు, ఆటోలు అందుబాటులో ఉన్నప్పటికీ కరోనా ఉధృతి దృష్ట్యా నగరవాసులు ఆచితూచి ప్రయాణం చేస్తున్నారు.

అవసరమైతే తప్ప వాటిని వినియోగించుకోవట్లేదు. వీలైనంత వరకు సొంత వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రజారవాణా వాహనాల కంటే కార్లు, ద్విచక్ర వాహనాల రద్దీయే ఎక్కువగా కన్పిస్తోంది. వ్యాపార కేంద్రాలు తెరుచుకున్నా.. కొనుగోళ్లు మాత్రం ఊపందుకోలేదు. తిరిగి సాధారణ వాతావరణం నెలకొనేందుకు మరో వారం రోజులు పట్టొచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ దుకాణం ముందు చెప్పులు కుడుతున్న దృశ్యం..

శివార్లకే పరిమితం..
హైదరాబాద్‌ మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బస్సుల రాకపోకలకు అనుమతివ్వడంతో సుమారు 400 బస్సులు మొదటి రోజు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. వీటిని నగర శివార్ల వరకే అనుమతించారు. 139 బస్సులు జేబీఎస్‌ వరకు వచ్చాయి. కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాటిని జేబీఎస్‌ వరకు అనుమతించారు. వరంగల్, హన్మకొండ, జనగామ వైపు నుంచి 60 బస్సులు ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వరకు వచ్చాయి.

ఖమ్మం, నల్లగొండ మీదుగా వచ్చే వాటిని హయత్‌నగర్‌ వరకు అనుమతించారు. 70 బస్సులు ఈ రూట్‌లో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లాయి. మహబూబ్‌నగర్‌ వైపు నుంచి 102 బస్సులు వచ్చాయి. ఇవి ఆరాంఘడ్‌ వరకు రాకపోకలు సాగించాయి. చేవెళ్ల, శంకర్‌పల్లి నుంచి వచ్చిన 30 బస్సులు అప్పా జంక్షన్‌ వరకు రాకపోకలు సాగించాయి. బస్సుల నిర్వహణలో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించారు. మొదటి రోజు కావడంతో ప్రయాణికుల సంఖ్య తక్కువగానే ఉంది.

ఒక్కో బస్సులో 20 నుంచి 30 మంది మాత్రమే ప్రయాణం చేశారు. బస్సులు ఎక్కే సమయంలో మాస్కు ఉన్న వారినే లోపలికి అనుమతించారు. భౌతిక దూరం పాటించేలా ఆర్టీసీ సిబ్బంది బస్‌స్టాండ్లలో విధులు నిర్వహించారు. బస్సు ఎక్కిన ప్రయాణికులు తప్పనిసరిగా శానిటైజర్‌ ద్వారా చేతులు శుభ్రం చేసుకొన్న తర్వాతే సీట్లోకి వెళ్లి కూర్చునేలా డ్రైవర్లు జాగ్రత్తలు పాటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement