సాక్షి, వికారాబాద్: ఈనెల చివరన లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అందుకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు బిజీబిజీగా ఉన్నారు. గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ, జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఈసారి మరింత పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 30న ఎన్నికల నిర్వహించేందుకు అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం సూచనప్రాయంగా వెల్లడించడంతో ఆ దిశగా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తిచేసిన అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నది.
పార్లమెంటు ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పలు ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఎన్నికల నిర్వహణకు వైద్య, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలను మినహాయించి మిగతా శాఖల ఉద్యోగుల వివరాలను పంపించాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో అధికారులు ఆ పని పూర్తి చేశారు. ఆరు నెలల్లో పదవీ విరమణ పొందేవారికి, గర్భిణులకు, బిడ్డలకు పాలు ఇచ్చే ఉద్యోగినులు, కదలలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు మాత్రం ఎన్నికల విధులనుంచి మినహాయింపు ఉంటుంది.
అదేవిధంగా దీర్ఘకాలికంగా సెలవులో ఉన్నవారికి కూడా ఎన్నికల విధులు అప్పగించరాదని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. వీరు మినహాయించి ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు డుమ్మా కొట్టరాదని స్పష్టం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పలు కారణాలు చూపుతూ చాలామంది విధులను ఎగనామం పెట్టేందుకు ప్రయత్నించారు. ఈసారి మాత్రం పకడ్బందీగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
31 పోలింగ్ కేంద్రాల పెంపు
లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. అధికారులు ఒక్కో పనిని పూర్తిచేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగా అవసరమైన చోట్ల పోలింగ్ కేంద్రాలను పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మరో 31 పోలింగ్ కేంద్రాలను అదనంగా ఏర్పాటుకు సిఫారసు చేశారు. గత ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,400 మంది ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 1,200 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరక పోలింగ్ జరగాల్సి ఉన్నా.. కొన్ని కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో రాత్రి 7 గంటల వరకు కూడా ఓటింగ్ జరిగింది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చోట్ల పోలింగ్ కేంద్రాలను పెంచే ప్రతిపాదనలను పంపించాలని ఎన్నికల కమిషన్ సూచించింది.
పట్టణ ప్రాంతాల్లో 1,300 మంది ఓటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 1,100 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈనేపథ్యంలో జిల్లాలో అదనంగా మరో 31 కేంద్రాలు అవసరమని సిఫారసు చేశారు. ఈ నిర్ణయంతో గత ఎన్నికల్లో 1,095 ఉన్న పోలింగ్ కేంద్రాలు 1,126కు చేరనున్నాయి. జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లావ్యాప్తంగా 8,40,181 మంది ఓటర్లుండగా, వీరిలో పురుషులు 4,21,561 మంది, మహిళలు 4,18,558 మంది ఉన్నారు. ఇతరులు 67 మంది ఉన్నారు. ఇటీవల ఓటరు నమోదు కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టడంతో సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తుది జాబితాను ఈనెల 22న ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్ వెల్లడించారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోకి మన జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి సెగ్మెంట్లతో పాటుగా రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు వస్తాయి.
త్వరలో జరగనున్న ఎన్నికలకు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సంయుక్తంగా ఆర్‌ఓగా వ్యవహరించనున్నారు. అయితే, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ మన జిల్లాకు కూడా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండడంతో ఆయనే చేవెళ్ల పార్లమెంటుకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారు. త్వరలో సర్కారు జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్‌ను నియమించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లనే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించనున్నందున వీటిని నిపుణుల ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈపీ (ఎలక్షన్ పిటిషన్లు) లేని నియోజకవర్గాల ఈవీఎంలనే పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ వివాదంలోనే జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment