
పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య
తిప్పర్తి: నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మాడుగులపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ తోటలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. మృతులను నిడవనూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన నరేష్, మిర్యాలగూడ మండలం జప్పి వీరప్పగూడెంకు చెందిన నవనీతగా గుర్తించారు. వీరిద్దరూ మిర్యాలగూడలో డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. గత ఏడాదే డిగ్రీ పూర్తి అయింది. నవనీతకు ఈ నెల 2వ తేదీ మరో యువకునితో వివాహమైంది. అయితే తనకు ఇష్టంలేని పెళ్లి చేయడంతో మనస్తాపానికి గురైన నవనీత, తన ప్రియునితో కలిసి ఈ నెల 7వ తేదీ ఇల్లు వదిలి వెళ్లిపోయింది.
ఈ క్రమంలో తిప్పర్తి మండలం మాడుగులపల్లి సమీపంలోని తోటలో కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగారు. ఇద్దరూ అక్కడే మృతి చెందారు. అయితే మంగళవారం ఉదయం వీరు మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.