మెట్రో నష్టాన్ని చెల్లించండి! | L&T letter to Telangana Government | Sakshi
Sakshi News home page

మెట్రో నష్టాన్ని చెల్లించండి!

Published Thu, Jun 25 2020 4:31 AM | Last Updated on Thu, Jun 25 2020 7:48 AM

L&T letter to Telangana Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మూడు నెలలుగా డిపోలకే పరిమితమైన మెట్రో రైళ్లతో నిర్మాణ సంస్థకు వాటిల్లిన నష్టాన్ని పరిహారంగా అందజేయాలని మెట్రో నిర్మాణ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈమేరకు ఎల్‌అండ్‌టీ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసినట్లు సమాచారం. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ..హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థలు అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ అనధికారికంగా విషయం బయటకు పొక్కడం గమనార్హం. నిర్మాణ ఒప్పందం ప్రకారం మెట్రో నిర్మాణానికి నిర్మాణ సంస్థ చేసిన వ్యయాన్ని..సుమారు 35 ఏళ్లపాటు ప్రయాణికుల చార్జీలు, వ్యాపార, వాణిజ్య ప్రకటనలు, వాణిజ్య స్థలాలు, రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించని పక్షంలో కనీసం 3 నెలలపాటు జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు మెట్రో నిర్వహణ ఒప్పందాన్ని మరో 4–6 నెలల పాటు పెంచాలని లేఖలో కోరినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చి 22 నుంచి మెట్రో రైళ్లు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం నాగోల్‌–రాయదుర్గం, జేబీఎస్‌–ఎంజీబీఎస్, ఎల్బీనగర్‌–మియాపూర్‌ మూడు రూట్లలో 69 కి.మీ మార్గంలో మెట్రో అందుబాటులో ఉన్న విషయం విదితమే. నిత్యం 4 లక్షల మంది..సెలవురోజుల్లో ç 4.5 లక్షల మంది మెట్రో జర్నీ చేసేవారు. దీంతో ప్రయాణికుల చార్జీలు, వ్యాపార, వాణిజ్య ప్రకటనల ద్వారా నిర్మాణ సంస్థకు ప్రతినెలా రూ.50 కోట్లు రెవెన్యూ ఆదాయం లభించేది. గత 3 నెలలుగా ఆదాయం లేకపోవడంతో రూ.150 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా.  మెట్రో స్టేషన్లు, డిపోలు, రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు వెరసి సంస్థకు నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతుండటం గమనార్హం.

నాడు నిర్మాణ వ్యయం..నేడు నిర్వహణ వ్యయం..
మెట్రో ప్రాజెక్టు సాకారం అయ్యేందుకు 2011 నుంచి 2017 వరకు ప్రస్థానం కొనసాగింది. ఆస్తుల సేకరణ, న్యాయపర చిక్కులు, రైట్‌ ఆఫ్‌ వే సమస్యల కారణంగా ప్రాజెక్టు నిర్మాణం రెండేళ్లు ఆలస్యమైంది. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.14 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. పెరిగిన నిర్మాణ వ్యయాన్ని చెల్లించాలని కూడా గతంలో నిర్మాణ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పట్లో లేఖ రాసిన విషయం విదితమే. తాజాగా నిర్వహణపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్న సంస్థ నిర్వహణ భారాన్ని పరిహారంగా చెల్లిం చాలని కోరడం గమనార్హం. కాగా దేశ రాజధాని ఢిల్లీ..మన పొరుగునే ఉన్న చెన్నై, బెంగళూరు, ముంబై మహానగరాల్లో మెట్రో ప్రాజెక్టులను అక్కడి ప్రభుత్వాలు, ప్రత్యేక కార్పొరేషన్ల ద్వారా నిర్వహిస్తున్నాయి. కానీ నగరంలో చేపట్టిన మెట్రో ప్రాజెక్టు పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యం తో ప్రపంచం లోనే అతిపెద్దది కావడం విశేషం. ఈ నేపథ్యంలో నష్టాన్ని ప్రభుత్వం కూడా భరించాలని ఈ సంస్థ కోరుతుండటం గమనార్హం.

నష్టాల బాట ఎన్నాళ్లో?
లాక్‌డౌన్‌కు ముందు లాభం..నష్టం లేని స్థితికి చేరుకుంటున్న తరుణంలో కోవిడ్‌ విసిరిన పంజాకు మెట్రో నిర్మాణ సంస్థ కుదేలైపోయింది. లాక్‌డౌన్‌ పేరుతో భారీ నష్టాన్ని మూటగట్టుకుంటోంది. సంస్థ కోరినట్లుగా పరిహారం చెల్లిస్తుందా..నిర్వహణ గడు వు పొడిగిస్తుందా అన్న విషయం తేలాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement