హైదరాబాద్‌ మెట్రోరైల్‌: డేంజర్‌ బెల్స్‌ | Danger Bells At Hyderabad Metro Rail | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ మెట్రోరైల్‌: డేంజర్‌ బెల్స్‌

Published Sun, Oct 13 2019 1:52 PM | Last Updated on Sun, Oct 13 2019 2:00 PM

Danger Bells At Hyderabad Metro Rail - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రోరైల్‌ బాలరిష్టాలు ఎందుకు దాటడం లేదు ? ఎల్‌ అండ్‌ టీ లాంటి పెద్ద సంస్థలో సైతం నిర్వాహణ లోపాలు పదేపదే ఎందుకు తలెత్తుతున్నాయి ? ఊడుతున్న పెచ్చులు, టెక్నికల్‌ సమస్యలతో మెట్రో ఎందుకు మొరాయిస్తోంది? మెట్రోరైల్‌లో పరిస్థితులు మారవా? రెండు సంవత్సరాలు కూడా కాలేదు. ట్రాఫిక్‌ జామ్‌ల నుంచి ప్రజల్ని కాపాడుతుందని ఏర్పాటుచేసిన మెట్రోరైల్‌లో తరుచూ సమస్యలు తలెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న అమీర్‌పేట స్టేషన్‌లో పెచ్చులూడిపడటంతో ఓ మహిళ ప్రాణాల్ని కోల్పోయింది. దీనికి కారణం పర్యవేక్షణ లోపమేనని అధికారులు తేల్చిన పరిస్ధితి. మెట్రో స్టేషన్ల కింద నిలుచున్న ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసే స్ధాయికి మెట్రో నిర్మాణంలో లోపాలు వచ్చాయంటే ఇది ఎవరి తప్పు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎల్‌ అండ్‌ టీ లాంటి పెద్ద నిర్మాణ రంగ సంస్థ నిర్మిస్తున్న మెట్రోరైల్‌లో ఇన్ని లోపాలున్నాయా? అని ప్రయాణీకులు విస్మయపోయే పరిస్ధితి.  

సాంకేతిక లోపం.. ప్రయాణికులకు అష్టకష్టాలు
ప్యారడైజ్‌ సర్కిల్‌ ప్రాంతంలో మెట్రోరైల్‌లో ఎలక్ట్రికల్‌ లోపాల కారణంగా మెట్రోరైల్‌ ఆగిపోయింది. కనీసం అక్కడికి వెళ్లి మరమత్తులు చేద్దామని టెక్నికల్‌ టీమ్‌ అనుకున్నాకూడా మెట్రోరైల్‌లో లోపాన్ని సరిచేయలేకపోయారు. దీంతో మరో ట్రైన్‌ను తెప్పించి దాన్ని అమీర్‌ పేట్‌ జంక్షన్‌కు తీసుకువెళ్ళిన పరిస్ధితి. దీంతో దాదాపు గంటపాటు ప్రయాణీకులు అష్టకష్టాలు పడ్డారు. వర్షాలు పడితే చాలు కింద రోడ్లమీద ఎలాగు ప్రయాణించలేం.. కనీసం మెట్రోరైల్‌లోనైనా ప్రయాణించాలనుకుంటే వర్షాలకు ఫ్లెక్సీలు మెట్రో ట్రాక్‌పై పడటంతో మెట్రోట్రైన్లు ఆగిపోతున్నాయి. అసెంబ్లీ ప్రాంతంలో లెథనింగ్ అరెస్టర్‌ రాడ్‌ ట్రాక్‌పై ఫ్లెక్సీలు పడటంతో ట్రైన్‌ను సడెన్‌గా ఆపివేసిన పరిస్థితి తలెత్తింది. సరిగ్గా ట్రాక్‌ పైన సేఫ్టీ చెకింగ్‌లు చేసి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదనే వాదనలు అప్పట్లో వినపడ్డాయి. అంతేకాదు చాలాసార్లు మెట్రోరైల్ సడెన్‌ బ్రేక్‌లతో  ప్రయాణీకులకు దెబ్బలుతగిలి గాయలపాలు అయ్యారు. ఇక, వాహనాల పార్కింగ్‌కు స్ధలాలు లేవు. పైగా ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిన పార్కింగ్‌ స్థలాలను సైతం ప్రైవేటువారికి కట్టబెట్టి ఛార్జీల మోత మోగిస్తున్నారు. ఇక మెట్రోస్టేషన్‌లో ప్రయాణీకుల కనీస అవసరాలు తీర్చేందుకు కావాల్సిన టాయిలెట్స్‌ కానరావు. హైటెక్ హంగులతో నిర్మించిన మెట్రోరైల్‌లో మంచి నీళ్ళు ఉండవు. వాటర్‌ బాటిల్స్‌ కొనుకున్నా వాటిని మెట్రోట్రైన్‌లో అనుమతించరు.

తాగుబోతు వీరంగం
తమకు సేఫ్టీ ముఖ్యమంటూ హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఎంత చెపుతున్నా అందుకు తగ్గ ఏర్పాట్లు మెట్రోరైల్‌లో పెద్దగా కనపించవు. దీంతో తాగుబోతులు ఎంచక్కా మెట్రోరైల్‌ ఎక్కి తోటి ప్రయాణీకుల్ని ఇబ్బందుల పాలు చేస్తున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే ఒక ప్రయాణీకుడు బాగా తాగేసి ట్రైన్‌లోకి వచ్చి హల్‌చల్‌ చేశాడు. ఇది కూడా నిర్లక్ష్యానికి నిదర్శనంగానే చెప్పవచ్చు. పైగా మెట్రోరైల్‌ ఏర్పాటు చేసింది సాధారణ ప్రయాణీకులకు కానీ ఇక్కడ ఆర్టీసీ బస్‌ బేలుండవు. ఊబర్‌, ఓలా లాంటి కంపెనీల కార్‌లకు మాత్రం స్వయంగా హెచ్‌ఎంఆర్‌ఎల్‌ పార్కింగ్‌ సదుపాయాల్ని కల్పించి ఇస్తుంది. దీనిపై మెట్రో అధికారులపైన విమర్శలు కూడా వస్తున్నాయి. మెట్రోస్టేషన్ల నిర్మాణంలో సైతం లోపాలున్నాయని చాలామంది ఆరోపిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ఉప్పల్ స్టేషన్‌కు సంబంధించిన మెట్రోస్టేషన్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. వర్షం కురియడంతో నీరు లోపలికి వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన మెట్రో అధికారులు దానికి కాస్త మెరుగులు దిద్ది.. రంగులు వేసి కప్పిపెట్టారు.

తొందరపాటు నిర్ణయాలు.. పర్యవేక్షణాలోపం
అనుకున్న టార్గెట్‌ పూర్తి కావటానికి అనుకున్న టైం కంటే ముందుగా ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి ఎల్‌ అండ్‌ టీ తీసుకుంటున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలు మెట్రో సేఫ్టీని ప్రశ్నార్థకంగా చేస్తున్నాయి. పైన ట్రాక్‌ నుంచి కింద పిల్లర్ల వరకు చెక్ చేయాల్సిన ఇంజనీర్లు లేకపోవడమే ప్రమాదాలకు కారణంగా కనపడుతోంది. అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌ బయట జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇండియన్‌ రైల్వేలో ప్రతి 50 కిలోమీటర్ల ట్రాక్‌ చేయడానికి ఒక సీనియర్‌ ఇంజనీర్‌తోపాటు 200 మంది గ్యాంగ్‌మెన్స్‌ ఉంటారు. కానీ, హైదరాబాద్‌ మెట్రోరైల్‌లో మాత్రం ఆ పరిస్ధితి లేదు. రెండు పిల్లర్ల మధ్య కట్టే గోడలలో కూడా నాణ్యత లోపించింది. పనులు త్వరగా పూర్తి కావాలనే నెపంతో క్వాలిటీ లేకుండానే కట్టిపడేసి పనిపూర్తయ్యిందనిపించారని, పనులు జరుగుతున్నా సరే కొన్నిచోట్ల ట్రాఫిక్‌కు అనుమతి ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పైన మెట్రో వర్క్‌ జరుగుతున్నప్పుడు సేఫ్టీ నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. పర్యావేక్షణ లోపమే కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఇకనైనా ప్రైవేటు కంపెనీలకు పట్టం కట్టడం మానేసి ప్రయాణీకుల్ని ఎంతమందిని ఎక్కించాం అని సొంత డబ్బలు కొట్టుకోకుండా.. వారిని ఎంత జాగ్రత్తగా గమ్యానికి చేర్చామనే దానిపైనే హైదరాబాద్‌ మెట్రోరైల్‌ అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
-రాజ్‌కుమార్‌, బిజినెస్‌ స్పెషల్‌ కరస్పాండెంట్, సాక్షిన్యూస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement