సాక్షి, హైదరాబాద్ : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేకువజామునే స్నానమాచరించి గుడికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజ రాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి సందర్భంగా ఆర్జిత సేవలన్నింటిని రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. స్వామివారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఖమ్మం: కల్లూరు మండలంలోని కాశ్మీర మహాదేవ క్షేత్రం శివాలయాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దంపతులు దర్శించుకున్నారు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు అభిషేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. కూసుమంచిలోని గణపేశ్వరాలయంలోని పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
సిద్దిపేట : హుస్నాబాద్ మండలం పొట్టపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దుబ్బాక మండలం చెల్లాపూర్‌లోని సోమేశ్వర ఆలయంలో శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
కొమురం భీం అసిఫాబాద్: కాగజ్ నగర్ మండలంలోని ఈజ్గాంలో శివమల్లన్న జాతర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.నల్లగొండ: తిప్పర్తి మండలం, రామలింగాలగూడెం శివాలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వీరికి పూజారులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి పాలకిషేకం చేసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం: సుజాతనగర్లో గల 400 ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన శివాలయంలో శివునికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో హాజరైన భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు బూర్గంపాడు మండలం మోతె గ్రామంలో పవిత్ర గోదావరి నదిమధ్యలో కొలువైన వీరభద్ర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో శివయ్యను దర్శించేందుకు తరలి వస్తున్నారు.
ములుగు: వెంకటాపురం మండలం లోని శ్రీ ఉమారామళింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేపట్టారు
రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక, అధ్యాత్మిక కేంద్రంగా మారబోతుందన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు.
మెదక్: పాపన్నపేట్ మండలంలోని నాగసాన్ పల్లి ఏడుపాయల వనదుర్గా మాతకు మంత్రి హరీష్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరి వెంట ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఉన్నారు. ఏడుపాయల మంజీర నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఉపవాస దీక్షతో వనదుర్గాభవాన్ని మాతను దర్శించుకుంటున్నారు. ఏడుపాయల వన దుర్గ భవాని క్షేత్రంలో ఎస్పీ శ్రీమతి చందన దీప్తి ఆదేశాల మేరకు మూడంచెల భద్రత నెలకొల్పారు.
కామారెడ్డి: బిచ్కుంద మండల కేంద్రంలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని జుక్కల్ ఎమ్యెల్యే హన్మంత్ షిండే సందర్శించారు. బాన్సువాడ మoడలం సోమేశ్వర్ సోమలింగాల ఆలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దపల్లి: మంథని వద్ద గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
జగిత్యాల: వెల్గటూరు మండలం కోటిలింగాల వద్ద భక్తులు గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించిస్తున్నారు. అనంతరం కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు చేపడుతున్నారు.
సంగారెడ్డి: ఝరాసంగం మండల కేంద్రంలోని కేతకీ సంగమేశ్వర స్వామిని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బి బి పాటిల్ దర్శించుకున్నారు. నారాయణఖేడ్‌లోని పంచగామ శివాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మంజీర నదిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు చిట్కూల్ చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆందోల్ గ్రామంలోని శివాలయంలోనూ అభిషేకాది కార్యక్రమాలు చేపట్టారు.
మంచిర్యాల్: లక్సెట్టిపేట దండేపల్లి జన్నారం శివరాత్రి సందర్భంగా ఉదయాన్నే గోదావరి పుణ్య స్నానం ఆచరించిన భక్తులు అనంతరం శివాలయాల్లో మొక్కులు తీర్చుకుంటున్నారు.
జోగులాంబ గద్వాల- అలంపూర్ బాలబ్రహ్మేశ్వరాలయంలో భారీగా తరలివస్తున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గద్వాల సమీపంలో కృష్ణానదీలో పుణ్యస్నానాలు ఆచరించి నదీఆగ్రహారం స్పటిక రామేశ్వరాలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టారు. అడ్డాకుల మండలం కందూరులో కల్పవృక్షాలకు నెలవైన శ్రీ రామలింగేశ్వరాలయాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు.
నిజామాబాద్: మహా శివరాత్రి పర్వదిన వేడుకలు జిల్లాలో వైభవంగా కొనసాగుతున్నాయి. నీల కంటేశ్వరాలయం , శంభుని గుడి, ఆర్మూర్ నవనాథ సిద్దేశ్వరాలయం, బోధన్ చక్రేశ్వరాలయం, లొంక రామ లింగేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. నీలకంటేశ్వర ఆలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు ప్రత్యేక పూజలు చేశారు.
ఆర్మూర్: నవ సిద్ధుల గుట్టపై భక్తుల తాకిడి పెరిగింది.
నిర్మల్: బాసరలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఉప ఆలయం శ్రీ సురేశ్వరాలయం, శ్రీ వ్యాసేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. తెల్లవారుజామున సుప్రభాతసేవతో సంతతధార అభిషేకాలు మొదలయ్యాయి. శివలింగానికి ఆలయ అర్చకులు, వేదపండితులు బిల్వార్చనతో పూజలు చేశారు. సాయంత్రం ప్రదోష కాలంలో మహాలింగార్చన కార్యక్రమం తలపెట్టారు. పుట్టమన్నుతో చేసిన 365 మృత్తికా లింగమూర్తులకు వేదమంత్రోత్సరణతో అభిషేక పూజలు నిర్వహించనున్నారు. రాత్రి లింగోద్భవ సమయంలో సూర్యేశ్వర, వ్యాసేశ్వర ఆలయాల్లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహా హారతి, మంత్రపుష్పంతో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
మంచిర్యాల: లక్సెట్టిపేట దండేపల్లి జన్నారంలో శివరాత్రి సందర్భంగా భక్తులు ఉదయాన్నే గోదావరి పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం శివాలయాల్లో మొక్కులు తీర్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment