కీసరగుట్టలో ఆరు రోజుల వైభవం | Maha Shivaratri Brahmotsavam Starts in Keesara Temple | Sakshi
Sakshi News home page

ఆరు రోజుల వైభవం

Published Sat, Mar 2 2019 9:12 AM | Last Updated on Sat, Mar 2 2019 9:26 AM

Maha Shivaratri Brahmotsavam Starts in Keesara Temple - Sakshi

కీసర: ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. మార్చి 7 వరకు ఆరు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. టీటీడీ వేద పాఠశాల ప్రిన్సిపాల్‌ మల్లికార్జున అవధాని సర్వోపద్రష్టగా, కీసరగుట్ట పూజారులు బలరాంశర్మ, రవిశర్మ, ఆచార్య పుల్లేటీకుర్తి గణపతిశర్మ ప్రధాన సంధానకర్తలుగా వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఆలయ చైర్మన్‌ తటాకం నారాయణశర్మ దంపతులు   విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, రుత్విక్‌వరణం, యాగశాల ప్రవేశం, అఖండజ్యోతి ప్రతిష్టాపనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సాయంత్రం 4గంటలకు అగ్నిప్రతిష్టాపన, బేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, హారతి, రాత్రి 7గంటలకు మంత్రపుష్పం, పరాకస్తవం, తీర్థప్రసాద వినియోగం, రాత్రి 8గంటలకు స్వామివారిని నందివాహన సేవ ద్వారా కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. మహాశివరాత్రి (సోమవారం) రోజున జాతరకు 8–10 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 20 కమిటీలు ఆయా ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. నేటి నుంచి పారిశుధ్య, ఆర్‌డబ్ల్యూఎస్, పోలీస్, వైద్యశాఖ, విద్యుత్‌ తదితర అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. అదే విధంగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతిఏటా నిర్వహించే జిల్లా స్థాయి క్రీడోత్సవాలను శనివారం ప్రారంభించనున్నారు. జాతర సందర్భంగా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్‌ ఎంవీ రెడ్డి క్రీడోత్సవాలు, ఎగ్జిబిషన్‌నుప్రారంభిస్తారు.  

పూజా కార్యక్రమాలివీ...  
తొలి రోజు (మార్చి 2): ఉదయం 11గంటలకు విఘ్నేశ్వర పూజతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. అనంతరం పుణ్యాహవాచనం, రుత్విక్‌వరణం, యాగశాల ప్రవేశం, అఖండజ్యోతి ప్రతిష్టాపనం, అగ్నిప్రతిష్టాపన, బేరీపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, మంత్రపుష్పం. రాత్రి 8గంటలకు స్వామివారు కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి విచ్చేస్తారు.  
రెండో రోజు: ఉదయం 9గంటల నుంచి రుద్రస్వాహాకార హోమం, సాయంత్రం 4గంటల నుంచి బిల్వార్చన, రాత్రి 7గంటలకు ప్రదోషకాల పూజ, హారతి, మంత్రపుష్పం, పరాకస్తవం. రాత్రి 8గంటల నుంచి స్వామివారు కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు విచ్చేస్తారు. రాత్రి 10గంటలకు పూర్వాషాఢ నక్షత్రయుక్త కన్యలగ్నమందు   శ్రీభవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామివార్ల కల్యాణోత్సవం.

మూడో రోజు: మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున 4గంటల నుంచి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాముహిక అభిషేకాలు, రుద్రస్వాహాకార హోమం, రాత్రి 8గంటలకు  నందివాహన సేవ, భజనలు, రాత్రి 12గంటల నుంచి లింగోద్భవ కాలంంలో శ్రీరామలింగేశ్వర స్వామికి సంతతదారాభిషేకం.  
నాలుగో రోజు: ఉదయం 5:30 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 6 గంటల నుంచి కల్యాణ మండపంలో సాముహిక అభిషేకాలు, 9గంటలకు రుద్రస్వాహాకార హోమం, రాత్రి 7గంటల నుంచి ప్రదోశకాల పూజ, మంత్రపుష్పం, రాత్రి 7గంటలకు స్వామివారి విమాన రథోత్సవం.  
ఐదో రోజు: ఉదయం 5:30గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సాముహిక అభిషేకాలు, ఉదయం 8గంటలకు అన్నాభిషేకం, రాత్రి 8గంటలకు వసంతోత్సవం, పుష్పయాగం.  
ఆరో రోజు: మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సాముహిక అభిషేకాలు, ఉదయం10గంటలకు క్షేత్ర దిగ్బలి అనంతరం పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి.

పండగకు ప్రత్యేక బస్సులు
సాక్షి, సిటీబ్యూరో: మహాశివరాత్రి సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కీసర, ఏడుపాయల జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వినోద్‌కుమార్‌ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 2–7 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. సుమారు 150 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందించారు. తార్నాక, ఉప్పల్, సికింద్రాబాద్, అఫ్జల్‌గంజ్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, జేబీఎస్, ఏంజీబీఎస్, నాంపల్లి, ఈసీఐఎల్, అల్వాల్, పటాన్‌చెరు, మెహిదీపట్నం తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.   

భక్తులకు ఇబ్బందులు లేకుండా...  
భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధుల సహకారంతో జాతరను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాం. క్యూలైన్లలో ఉండే భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. ఇప్పటికే లక్షన్నర లడ్డూ ప్రసాదాలను సిద్ధంగా ఉంచాం.      – తటాకం నారాయణశర్మ, ఆలయ చైర్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement