మహాత్మా.. ఇదేమిటయ్యా! | Mahatma Gandhi University, the stench of corruption | Sakshi
Sakshi News home page

మహాత్మా.. ఇదేమిటయ్యా!

Published Mon, Sep 22 2014 1:12 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

మహాత్మా.. ఇదేమిటయ్యా! - Sakshi

మహాత్మా.. ఇదేమిటయ్యా!

యూనివర్సిటీలో అవినీతి కంపు
రూ.కోట్లు వచ్చినా జరగని అభివృద్ధి    
 అడ్డగోలు నిధుల ఖర్చుపై లేని విచారణ

 
 సెమినార్, కాన్ఫరెన్స్ హాళ్ల ఇంటీరియర్ డెకరేషన్‌కు కోటి రూపాయలు.. ఒక్క కంప్యూటర్ టేబుల్‌కు రూ.15వేలు.. టెండర్లు లేకుండానే వంద ఏసీల కొనుగోలు.. ఇవీ.. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో  చోటుచేసుకున్న అవినీతికి మచ్చుతునకలు. ఇదిలా ఉంటే.. నిధుల వరద పెద్దఎత్తున పారినా..  అభివృద్ధి జరిగిందా అంటే అదీ లేదు. 2011 నుంచి నేటికీ ఒక్క నూతన భవనం నిర్మించక పోవడం గమనార్హం.
 - ఎంజీయూ (నల్లగొండ రూరల్)  
 
విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో దివంగత సీఎం వైఎస్సార్.. జిల్లాకు మహాత్మాగాంధీ యూనివర్సిటీని మంజూరు చేశారు. యూనివర్సిటీని జిల్లాకేంద్రం శివారు అన్నెపర్తిలో నెలకొల్పారు. ఎంతో సదాశయంతో ఏర్పాటుచేసిన ఈ యూనివర్సిటీ పేరును దిగజార్చేలా అక్కడ పనులు కొనసాగడం పట్ల మేధావులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీకి వచ్చిన నిధులను సంబంధిత అధికారులు ‘రూ.రెండు లక్షల’ లాజిక్‌ను అడ్డుపెట్టుకుని ఎలాంటి టెండర్లూ లేకుండా అక్రమ బిల్లులు పెట్టి స్వాహాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న నిధులు మాత్రం ఖర్చు అవుతున్నాయి. కానీ 2011 నుంచి నేటికీ ఒక్క నూతన భవనం నిర్మించకపోవడంతో ఎలాంటి కొత్త కోర్సులు రావడం లేదు. ఉన్న కోర్సుల్లో చేరుతున్న విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. పానగల్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు హాస్టల్, ల్యాబ్, తరగతి గదులు లేకపోవడంతో అసౌకర్యాల నడుమే చదువుకుంటున్నారు.

2007లో యూనివర్సిటీ ఏర్పాటు...

వెనుకబడిన జిల్లాగా భావించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2007లో యూనివర్సిటీని మంజూరు చేశారు. పానగల్లులో పీజీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2008లో మహాత్మాగాంధీ యూనివర్సిటీగా పేరు ప్రకటించారు. ఆ తర్వాత అన్నెపర్తిలో 249 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటుకు రూ.10 కోట్లు కేటాయించారు.

ప్రస్తుతం ఉన్న భవనాలు ఇవీ..

సైన్స్ బ్లాక్, ఆర్ట్స్ బ్లాక్, బాయ్స్ హాస్టల్, లేడీస్ హాస్టల్ భవనాలను 2008 నుంచి 2011 వరకు పూర్తి చేశారు.
 
పునాది దశలోనే సెంట్రల్ లైబ్రరీ..

2011 నుంచి నేటి వరకు ఒక్క కొత్త భవనం నిర్మించలేదు. అప్పటి వీసీ, రిజిస్ట్రార్ ఎలాంటి కొత్త భవనాలు నిర్మించలేదు. 2011లో సెంట్రల్ లైబ్రరీ కోసం శంకుస్థాపన చేశారు. ఇక పునాది స్థాయిలో పిల్లర్లు వేసి వదిలేశారు.

ఇవీ.. వచ్చిన నిధులు

 2013-14లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.15 కోట్లు
 యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్) 12వ ప్రణాళిక కింద : రూ.7.50 కోట్లు
 యూజీసీ 12 ‘బీ’ కింద  : రూ.7 కోట్ల 50 లక్షలు
 విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వచ్చినవి రూ.3 కోట్లకు పైగా..
 12వ ప్లాన్ కింద రూ. 7. 50 కోట్లు (వీటిని ఐదు సంవత్సరాల కాలంలో మౌలిక వసతులకు ఉపయోగించాలి)

 మెరుగులు దిద్దేందుకు కోట్ల రూపాయలు ఖర్చు...

పై పై మెరుగులు దిద్దే పనులకు యూనివర్సిటీ అధికారులు కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఎక్కువ బిల్లులను చూపుతూ అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీసీ, రిజిస్ట్రార్ చాంబర్ల ఆధునికీకరణకు లక్షల రూపాయల బిల్లులు పెట్టి కొంత నొక్కేశారని, సైన్స్ బ్లాక్‌లో తాత్కాలిక లైబ్రరీని ఏర్పాటు చేసి నిధులు కాజేశారనే ఆరోపణలున్నాయి. ఆర్ట్స్ బ్లాక్‌లోని సెమినార్ హాల్‌తో పాటు కాన్ఫరెన్స్ హాల్‌కు ఇంటీరియర్ డెకరేషన్ కోసం రూ.కోటి ఖర్చు చేయడం చూస్తుంటే అధికారుల అక్రమ బిల్లుల బాగోతం ఏస్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇక.. కంప్యూటర్‌కు సంబంధించిన ఒక్క టేబుల్‌కు రూ.15 వేలు ఖర్చు చేసినట్లు సమాచారం. మొత్తం 100 ఏసీలు కొనుగోలు చేయడంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలున్నాయి.

 టెండర్ ఏదీ?

యూనివర్సిటీలో చేపట్టే పనులకు ఎలాంటి టెండర్ లేకుండా కంప్యూటర్ టేబుళ్లు, ల్యాబ్ సామగ్రి, లైబ్రరీ సామగ్రి, ఏసీలు, టేబుళ్లు కొనుగోలు చేశారు. వచ్చిన నిధుల్లో చేతివాటం ప్రదర్శించేందుకు వారం, 10 రోజులకు ఒకసారి సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. రూ. 2లక్షలు దాటితే టెండర్ పిలవాల్సిన నిబంధన ఉండడంతో రూ.2 లక్షలు మించకుండా నిధులను ఖర్చు చేసి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇవీ.. అసంపూర్తి పనులు

యూనివర్సిటీకి నిధుల వరద పారినా.. యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ, సైన్స్‌బ్లాక్‌లోని సెమినార్ హాల్, మొదటి, రెండవ ఫ్లొర్‌లోని అసంపూర్తి గదులు, స్పోర్ట్స్ గ్రౌండ్, అంతర్గత రోడ్ల కోసం కంకరపోసి రెండేళ్లు గడిచినా తట్టెడు పని జరగలేదు. ఔట్‌సోర్సింగ్, రెగ్యులర్ నియామకాలపై విచారణ పెండింగ్‌లో ఉంది. యూనివర్సిటీలో అవినీతి అక్రమాలపై ప్రస్తుత వీసీ దృష్టి సారించాల్సిన అవసరముందని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, సిబ్బంది కోరుతున్నారు.
 
ఖర్చుల విషయం నాకు తెలియదు

యూనివర్సిటీకి గతంలో వచ్చిన నిధులకు సంబంధించిన ఖర్చుల విషయం నాకు తెలియదు. రూ.140 కోట్లు కావాలని 14వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు ఇచ్చాం. రూ.40 కోట్లు ఇంజినీరింగ్ కోసం, మరో రూ.40 కోట్ల యూనివర్సిటీ వ్యవహరాలకు ఖర్చు చేస్తాం. కొత్త భవనాలు, కొత్త కోర్సులు తీసుకురావాల్సి ఉంది.
 - నరేందర్‌రెడ్డి, రిజిస్ట్రార్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement