
సాక్షి, హైదరాబాద్: మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి (68) మృతిచెందారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం కన్నుమూశారు. కనకారెడ్డి 2014లో మల్కాజ్‌గిరి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా గత అసెంబ్లీ ఎన్నికల పోటీకి ఆయన దూరంగా ఉన్నారు. 2008లో తొలిసారి ప్రజారాజ్యంలో చేరిన ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. అనంతరం 2013లో టీఆర్‌ఎస్‌లో చేరి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1951లో సికింద్రాబాద్‌లో జన్మించిన ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి ఈటల సంతాపం
మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యేగా కనకారెడ్డి చేసిన సేవలను ఆయన కొనియాడారు. కనకారెడ్డి మృతిపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఈటల రాజేందర్, మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషనన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఈద శంకర్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు.