హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ... తెర వెనుక మాదకద్రవ్యాల విక్రయం, నకిలీ కరెన్సీ మార్పిడికి పాల్పడుతున్న ఓ యువకుడిని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అదనపు డీసీపీ ఇ.రామ్‌చంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... శంషాబాద్‌లోని తొండుపల్లికి చెందిన యు.మహేష్ బీటెక్ పూర్తి చేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి జల్సాలు చేయడం ప్రారంభించాడు.
ఈ నేపథ్యంలోనే ఇతడికి కొందరు మాదకద్రవ్యాల విక్రేతలతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి నుంచి హెరాయిన్ వంటి డ్రగ్స్ ఖరీదు చేస్తున్న మహేష్... సెలబ్రెటీ ఈవెంట్లు, కార్నివాల్స్‌తో పాటు కళాశాలలకూ వెళ్తూ అమ్మడం ప్రారంభించాడు. దీనికితోడు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం నకిలీ కరెన్సీ మార్పిడీ చేస్తున్నాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం వలపన్ని అరెస్టు చేశారు. 50 గ్రాముల హెరాయిన్, రూ.83 వేల నకిలీ కరెన్సీ, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్
Published Fri, Jan 8 2016 8:26 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
Advertisement
Advertisement