
సాక్షి, గద్వాల(మహబూబ్‌నగర్): దాదాపు ఏడాది కిందట అదృశ్యమైన వారు హత్యకు గురయ్యారనే విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ కృష్ణఓబుల్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ఎల్కూరుకి చెందిన సంజన్నకు ఇద్దరు భార్యలు. రెండవ భార్య సరోజ(24)కు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, కుటుంబ సమస్యలు తలెత్తడంతో భార్య సరోజ వేరే కాపురం పెట్టమని భర్త సంజన్నపై ఒత్తిడి తెచ్చేది. దీంతోపాటు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో రెండో భార్య, కుమారుడిని ఎలాగైనా చంపాలని భర్త పథకం పన్నాడు. ఈ క్రమంలో 2018 అక్టోబర్ 3వ తేదీన కర్నూల్ జిల్లా మంత్రాలయానికి వారిని తీసుకెళ్లాడు. అక్కడ తుంగభద్ర నదిలో స్నానం చేస్తుండగా భార్య, కుమారుడిని గొంతు నులుమి నదిలోనే వదిలేశాడు. విషయాన్ని గోప్యంగా ఉంచిన సంజన్న గ్రామానికి వచ్చి భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంజన్నపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే, ఇటీవల కాల్‌డేటా రావడంతో దాని ఆధారంగా విచారించగా.. భార్య, కుమారుడిని తానే చంపినట్లు ఒప్పుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మిస్సింగ్ కే సును హత్య కేసుగా మార్చి నిందితుడు సంజన్నను మంగళవారం గద్వాల కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.