
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్, కోఠి, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, చింతల్, గాజులరామారం, బేగంపేటలలో కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. రాణిగంజ్ వద్ద భారీ వృక్షం కూలడంతో.. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఎల్‌బీ నగర్‌లోని కాకతీయ కాలనీలో వరద నీటిలో ఓ మహిళ కొట్టుకుపోతుడంగా గమనించిన పవన్ అనే యువకుడు ఆమెను కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. సాగర్‌రింగ్ రోడ్డు వద్ద భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఎల్‌బీ నగర్ పోలీసులు జేసీబీ సాయంతో వరద నీటిని మళ్లించారు. ఆ నీరంతా కాకతీయ కాలనీలోకి చేరింది. ఇదే సమయంలో అటుగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ వరద నీటిలో కొట్టుకుపోయింది. ఇది గమనించిన పవన్ ఆ మహిళను కాపాడాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.