
తలతెగినా మేనిఫెస్టో అమలు చేస్తాం
- ఎంపీ బాల్క సుమన్
- వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ
శ్రీరాంపూర్ : తలతెగిన కూడా ఎన్నికల మేనిఫెస్టో అమలు చేసి తీరుతామని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు, టీబీజీకేఎస్ మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్యతో కలిసి శ్రీరాంపూర్ డివిజన్‌లోని ఎస్సార్పీ 3 గనిని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతు కార్మికులు ఆందోళన చెందవద్దని, వారసత్వ ఉద్యోగాలు ఇప్పించి తీరుతామని అన్నారు. కార్మికులకు ఐటీ మినహాయింపు ఇవ్వాలని అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని తెలిపారు.
గనులపై కార్మికులకు బాత్రూంలు, రెస్ట్‌హాల్స్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి యాజమాన్యంతో చర్చించామని, రూ.63 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. తమ హయాంలో కంపెనీ లాభాల వాటాను 18 నుంచి 20శాతానికి పెంచి ఇచ్చామని, ఈసారి మరింత పెంచేందుకు ముఖ్యమంత్రిని ఒప్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బేర సత్యనారాయణ, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవిందర్‌రెడ్డి, బ్రాంచి ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నాయకులు బంటు సారయ్య, పానుగంటి సత్తయ్య, నెల్కి మల్లేశ్, పోశెట్టి, ముక్కెర రమేశ్, కానుగంటి చంద్రయ్య, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతి, టీఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి ఆర్ వెంకటేశ్వర్‌రావు, వేల్పుల రవిందర్, మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతి, సర్పంచ్ ఎం రాజే ంద్రపాణి, గని ఫిట్ సెక్రెటరీ గోపియా, నాయకులు నీలం సదయ్య, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేలపై కార్మికుల ఆగ్రహం
వేదిక ఎక్కే ముందు కార్మికులను కలుసుకుంటూ వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలను కార్మికులు నిలదీశారు. ‘ఇప్పుడా వచ్చేది.. ఇన్నాళ్లు ఎటు పోయారు.. నమ్మి టీబీజీకేఎస్‌ను గెలిపించిన పాపానికి అరిగోస పడుతున్నాం. వారసత్వ ఉద్యోగాలు ఏమయ్యారుు. కాళ్లు, రెక్కలు అరిగిపోయాయని అన్‌ఫిట్ చెయ్యమంటే చెయ్యడం లేదు..’ అంటు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీబీజీకేఎస్ యూనియన్‌పై ఉన్న ఆక్రోశాన్ని కార్మికులు వీరిపై చూపించారు. దీంతో కంగుతిన్న ఇద్దరు నేతలు వారికి సర్ది చెప్పారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగింది వాస్తవమేనని, వాటన్నింటి పరిష్కారానికి కొంత సమయం ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. అనంతరం కార్మికుల రెస్టు హాల్స్‌ను పరిశీలించి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. క్యాంటీన్‌ను పరిశీలించి అందులోనే టిఫిన్ చేశారు. మేనేజర్ రమేశ్‌తో కార్మికుల సమస్యలపై చర్చించారు.