మంజీర.. ప్రాణాధార
మెతుకుసీమలో పరవళ్లు తొక్కుతూ.. పచ్చని పంటలకు ఊపిరి పోస్తున్న మంజీర.. ఇక ఇంటి తలుపు తడుతూ.. ప్రతిఒక్కరి గొంతూ తడిపే ప్రాణాధారంగా మారనుంది. రూ.5,400 కోట్ల అంచనా వ్యయంతో జిల్లాలో 447 కి.మీ. మేర పైప్‌లైన్ వేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు బృహత్ ప్రణాళిక ను సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వాటర్ గ్రిడ్ సర్వే కోసం మంగళవారం రూ.105 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* తీరనున్న జిల్లావాసుల దాహార్తి
* ఇక ఇంటింటికీ సరఫరా..
* 447 కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు
* రూ. 5,400 కోట్ల అంచనా వ్యయం
* అధికారుల బృహత్ ప్రణాళిక
మెదక్: జిల్లాలో సుమారు 95 కిలోమీటర్ల మేర మంజీర నది ప్రవహిస్తున్నా గొంతెండుతున్న పల్లెలెన్నో ఉన్నాయి. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఫ్లోరైడ్ నీటినే తాగుతూ వేలాది మంది అభాగ్యులు వికలాంగులుగా మారుతున్నారు. మూడు పదుల వయస్సులోనే ముదుసలి వారిగా కనిపిస్తూ జీవచ్ఛవాలుగా బతుకీడుస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మంజీర నది, సింగూరు ప్రాజెక్టు జలవనరుల్లో మూడు గ్రిడ్‌లను ఏర్పాటు చేసి 447 కిలోమీటర్ల మేర 2,456 గ్రామాలకు తాగు నీరందించే పథకాన్ని రూపొందించారు. సింగూరు నుంచి ప్రతియేటా 8.8 టీఎంసీల నీటితో గ్రామీణులు ఒక్కొక్కరికి ఒక్కరోజుకు వంద లీటర్లు, పట్టణాలు, నగర పంచాయతీల్లో ఉండే ప్రజలకు 135 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ లెక్కన మెదక్, గజ్వేల్, సంగారెడ్డి వాటర్ గ్రిడ్‌లను విభజించనున్నారు.
మెదక్ గ్రిడ్‌లో నారాయణ్‌ఖేడ్, అందోల్, దుబ్బాక నియోజకవర్గాలకు 201 కిలోమీటర్ల పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గానూ రాయికోడ్ మండలం రాయిపల్లి నుంచి సింగూరు బ్యాక్ వాటర్‌ను తీసుకుంటారు. అలాగే పుల్కల్ మండలం చక్రియాల్ శివారులోని మంజీరా ప్రాజెక్టు నుంచి గజ్వేల్ గ్రిడ్ పరిధిలోని నర్సాపూర్, గజ్వేల్ నియోజకవర్గాలకు తాగునీరందిస్తారు. ఇందుకోసం 96 కిలో మీటర్ల పైప్‌లైన్ వేస్తారు. ఇక సదాశివపేట మండలం ఎంఆర్‌ఎఫ్ వద్ద సింగూర్ ప్రాజెక్ట్ నుంచి సంగారెడ్డి గ్రిడ్‌ను ఏర్పాటు చేసి కుడి పైప్‌లైన్ ద్వారా జహీరాబాద్‌కు, ఎడమ పైప్‌లైన్ ద్వారా సదాశివపేట, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాల్లోని 150 కిలో మీటర్ల మేర పైప్‌లైన్ వేసి నీరందిస్తారు.
మెదక్ గ్రిడ్ స్వరూపం..
మెదక్ గ్రిడ్ ద్వారా ప్రతిరోజూ 280 మిలియన్ లీటర్ల తాగునీరందిస్తారు. రాయిపల్లి బ్రిడ్జి వద్ద సింగూరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో ఈ గ్రిడ్ నిర్మించనున్నారు. దీని పక్కనే ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి వట్‌పల్లి గుట్ట మీద ఓహెచ్‌బీఆర్ ఏర్పాటు చేసి నీటిని పంపిణీ చేస్తారు. నారాయణఖేడ్, వట్‌పల్లి, టేక్మాల్, పాపన్నపేట మండలం కొత్తపల్లిలో సంపులు ఏర్పాటు చేస్తారు. మెదక్ వెల్‌కం బోర్డు నుంచి రాజ్‌పల్లి, చిన్నశంకరంపేట వరకు మరో లైన్ వేస్తారు. మెదక్ పట్టణంలో ఒక సంపు ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి శమ్నాపూర్‌కు పైప్‌లైన్ వేస్తారు. అనంతరం అక్కన్నపేట గుట్టమీద ఓహెచ్‌బీ ఆర్ ట్యాంక్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి దుబ్బాక నియోజకవర్గంలోని తిమ్మాపూర్, సిద్దిపేటలోని ఇర్కోడ్, సిద్దిపేట మున్సిపాలిటీల నుంచి చేర్యాల వరకు ఈ పైప్‌లైన్ కొనసాగుతుంది. ఇందుకో సం ప్లానింగ్ తయారు చేస్తున్నట్లు మెదక్ ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సురేష్ తెలిపారు.