
విద్యార్థిని అనుమానాస్పద మృతి!
మృతదేహం కోసం మంజీరలో కొనసాగుతున్న గాలింపు
న్యాల్‌కల్ : అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్‌ఐ లవ్‌కుమార్, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. న్యాల్‌కల్‌కు చెందిన అంజన్న, సిద్దమ్మ దంపతుల రెండో కుమార్తె మౌనిక (19) జహీరాబాద్‌లోని వశిష్ట కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. ఎప్పటి మాదిరిగానే ఉదయం న్యాల్‌కల్ నుంచి బస్సులో జహీరాబాద్‌కు వెళ్లింది.
మధ్యాహ్నం తిరిగి ఇంటికి నారాయణఖేడ్ వైపు వెళ్లే ఆటోలో బయలు దేరింది. ఆటోలో వెళ్తుతున్న క్రమంలో తాను చెరువులో దూకి చస్తానని ఇతరులతో ఫోన్‌లో మాట్లాడుతుండగా విన్నట్లు సమాచారం. అయితే మౌనిక నారాయణఖేడ్ వైపు వెళ్తున్న విషయాన్ని గమనించిన కొందరు సమాచారాన్ని యువతి తల్లిదండ్రులకు తెలియజేశారు. విషయం తెలుసుకున్న మౌనిక తమ్ముడు సంతోష్‌కుమార్, చెల్లి స్వరూప రాఘవాపూర్ గ్రామ శివారులో గల మంజీర నది వద్ద గల బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. అప్పటికే మంజీర నదిలో దూకేందుకు బ్రిడ్జిపైన ఉన్న మౌనిక వైపు తమ్ముడు, చెల్లెలు పరుగులు తీశారు.
నదిలో దూకవద్దంటూ కేకలు వేశారు. వారు దగ్గరకు చేరుకునే లోపు మౌనిక మంజీర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న హద్నూర్ ఎస్‌ఐ లవ్‌కుమార్ ఈత గాళ్లను నదిలోకి దింపి మర పడవల సాయంతో మృతదేహం కోసం గాలించే చర్యలు చేపట్టారు. శుక్రవారం రాత్రి అయినప్పటికీ మౌనిక ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం ఉదయం మృతదేహం నీటిపై తేలే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. కుమార్తె మౌనిక కళాశాలకు వెళ్తానని చెప్పి.. ఇలా ఆత్మహత్యకు పాల్పడుతుందనుకోలేదని మృతురాలి తండ్రి అంజన్న బోరున విలపించాడు. విద్యార్థి మౌనిక మృతికి గల కారణాలు ఆమె మృతదేహం లభ్యమైతే తప్ప ఏమి చెప్పలేమని ఎస్‌ఐ లవ్‌కుమార్ వివరించారు.