వరద ప్రవాహం నుంచి బయటకు ఈదుకుంటూ వస్తున్న పశువులు
ఏటూరునాగారం/వెంకటాపురం(కె)/వాజేడు/భద్రాచలంటౌన్: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, మంగపేట తదితర ఏజెన్సీ మండలాలు అతలాకుతలమవుతున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద శనివారం రాత్రి 9.1 మీటర్లు ఉన్న నీటిమట్టం ఆదివారం ఉదయం 9.92 మీటర్లకు చేరింది. శనివారం 8.5 మీటర్లకు నీటిమట్టం చేరగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ఆదివారం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటిమట్టం 10.9 మీటర్లకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.
ముల్లకట్ట వద్ద 75 మీటర్ల ఎత్తులో సుమారు 2 కిలోమీటర్ల వెడల్పుతో 163 జాతీయ రహదారిని తాకుతూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలంలోని రాంనగర్, పరిసర తండాలను గోదావరి వరద చుట్టుముట్టింది. రాంనగర్ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పిల్లర్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓడవాడకు చెందిన 150 పశువులు వరదలో చిక్కుకోవడంతో వాటిని రైతులు తాళ్ల సహాయంతో బయటకు తీశారు. వెంకటాపురం మండలం బెస్తగూడెం సమీపంలోని గోదావరి లంకల్లో గొర్రెల కాపరులు, గొర్రెలు చిక్కుకున్నాయి. వెంకటాపురం సీఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు నాటు పడవల సహాయంతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయం 43 అడుగులు ఉన్న వరద రాత్రి 7 గంటలకు 50.06 అడుగులకు చేరింది. దీంతో ఒక్క రోజులోనే మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు.
జూరాలకు 1.73 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
గద్వాల టౌన్: కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి రోజురోజుకూ వరద పెరుగుతోంది. దీంతో జూరాలకు ఆదివారం 1.73 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, సోమవారం ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 13 క్రస్టు గేట్లను ఎత్తి 1,32,853 క్యూసెక్కులను, విద్యుదుత్పత్తి యూనిట్ల ద్వారా 34,422 క్యూసెక్కులను మొత్తం 1.72 లక్షల క్యూసెక్కులను దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment