శివంగాలపల్లిలోని జ్యోతి తల్లిదండ్రులు నేరెళ్ల జ్యోతి (ఫైల్)
కోనరావుపేట(వేములవాడ): ఒడిశాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్ కోనరావుపేట మండలంలో కలకలం రేపింది. ఇదే మండలంలోని శివంగాలపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క ఎన్‌కౌంటర్‌లో ఉన్నట్లు ప్రచారం కావడంతో మండలకేంద్రంతో పాటు గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలోని పుస్పూల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భధ్రాతా బలగాలకు మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్ట్ మృతి చెందినట్లు ప్రచారం జరిగింది. ఆమెపేరు జ్యోతి అని తెలియడంతో కోనరావుపేట మండలం శివంగాలపల్లి గ్రామంతో పాటు మండలం ఉలిక్కిపడింది. చివరికి శివంగాలపల్లికి చెందిన జ్యోతి కాదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
జ్యోతి నేపథ్యం ఇదీ...
కోనరావుపేట మండలం శివంగాలపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల నర్సయ్య, భూదవ్వల కూతురు జ్యోతి అలియాస్ జ్యోతక్క. ఐదోతరగతి వరకు స్థానిక పాఠశాలలో, 6–10 వరకు కోనరావుపేట ఉన్నత పాఠశాలలో, ఇంటర్ సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాలలో చదివింది. 2004లో శివంగాలపల్లిలో అప్పటి దళ కమాండర్ పద్మక్క గ్రామంలో సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశాన్ని కళ్లారా చూసి, మాటల్ని విన్న జ్యోతి ఉద్యమం పట్ల ఆకర్షితురాలైంది. కళాశాలలో చదువుతుండగానే సీవో రఘు ఆధర్యంలో దళంలోచేరి అజ్ఞాతంలోకి వెళ్లింది. మదిమల్ల ఎల్‌జీఎస్ దళ స భ్యురాలిగా ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, చందుర్తి, కథలాపూర్, నిజామాబాద్ జిల్లా సిరికొండ, భీంగల్ ప్రాంతాల్లో పనిచేసింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ లో దళకమాండర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
తల్లిదండ్రుల్లో ఆందోళన...
గురువారం ఎన్‌కౌంటర్ జరిగిందని, అందులో వీరి కూతురు ఉందని ప్రచారం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. నర్సయ్య, భూదవ్వ దంపతులకు ముగ్గురు కూతుళ్లు వినోద, ప్రేమల, జ్యోతి, ఇద్దరు కుమారులు మల్లయ్య, సుధాకర్ ఉన్నారు. వీరిలో మల్లయ్య మృతి చెందగా, జ్యోతి అజ్ఞాతంలో ఉంటుంది. ఎప్పటికైనా తమ కూతురు రాకపోతుందాని వృద్ధ తల్లిదండ్రులు వేచి చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment