
వెంకటాపురం(కె): జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం(కె) మండలం ఎదిరలో మావోయిస్టులు ఆదివారం అర్ధరాత్రి బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్‌ను పేల్చివేశారు. ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా ఈ నెల 5న మావోయిస్టు పార్టీ దండ కారణ్యం– తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఆర్‌అండ్ బీ ప్రధాన రహదారి పక్కన ఉన్న సెల్‌టవర్‌ను అర్ధరాత్రి 11.40 గంటలకు పేల్చివేశారు. 60 మంది సాయుధులైన మావోయిస్టులతో పాటు 150 మందికిపైగా గొత్తికోయలు విల్లంబులు ధరించి పాల్గొన్నట్లు తెలిసింది.
గ్రామంలోకి రాత్రి ప్రవేశించిన మావోయిస్టులు గంటకుపైగా హల్‌చల్ చేసినట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలాల మధ్య వచ్చివెళ్లే వాహనాలను గంటపాటు నిలిపివేసి రోడ్డును దిగ్బంధించినట్లు తెలిసింది. ఆరోగ్య ఉపకేంద్రం వద్ద బ్యాటరీతో టవర్‌ను పేల్చివేశారు. గ్రామస్తులతో సమావేశం నిర్వహించి నినాదాలు చేస్తూ అర్ధరాత్రి 12.30 గంటలకు అడవిలోకి వెళ్లిపోయారు.