
నిర్మించకుంటే మరో చోటుకు
నాబార్డు సహకారంతో మార్కెటింగ్ శాఖ తొలి విడతలో చేపట్టినవాటిలో 100 గోదాముల నిర్మాణం మార్చి 31లోగా పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు.
♦ ‘మార్కెటింగ్’ గోదాములపై మంత్రి హరీశ్‌రావు
♦ త్వరలో ఉల్లి పాలసీ ముసాయిదాకు తుది రూపు
♦ మార్కెటింగ్ శాఖ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: నాబార్డు సహకారంతో మార్కెటింగ్ శాఖ తొలి విడతలో చేపట్టినవాటిలో 100 గోదాముల నిర్మాణం మార్చి 31లోగా పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. మంజూరు చేసినా నిర్దేశిత గడువులోగా పనులు ప్రారంభం కాని చోటు నుంచి డిమాండు ఉన్న చోటుకు గోదాములను తరలిస్తామని స్పష్టం చేశారు. మార్కెటింగ్ శాఖ కార్యకలాపాలపై మంత్రి హరీశ్‌రావు బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ డాక్టర్ శరత్, అదనపు డెరైక్టర్ లక్ష్మీబాయి, అపెడా అధికారి సుధాకర్, మార్కెటింగ్ ఎస్‌ఈ నాగేశ్వర్‌రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు. తొలి విడతలో రూ.411 కోట్లతో 6.85 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న 128 గోదాములు, రెండో విడతలో రూ. 613.50 కోట్ల వ్యయంతో 10.22 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న 202 గోదాములు మంజూరు చేశామన్నారు. మంజూరైన గోదాములకు 2 వారాల్లో స్థలం చూపకుంటే ఇతర ప్రాంతాలకు తరలిస్తామన్నారు. గోదాములపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు గురించి సోలార్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌తో చర్చించాలని మార్కెటింగ్ శాఖ డెరైక్టర్‌ను ఆదేశించారు.
మూడు చోట్ల కోల్డ్ స్టోరేజీలు
వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ (అపెడా)తో కలిసి మార్కెటింగ్ శాఖ రూ.60 కోట్లతో బోయినపల్లి, గుడిమల్కాపూర్, వంటిమామిడిలో నిర్మించే కోల్డ్ స్టోరేజీల డీపీఆర్‌పై టాప్ బ్లూ సప్లై చైన్ కన్సల్టెన్సీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. వీటితో పాటు మరో రెండు చోట్ల కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలని మంత్రి హరీశ్ ఆదేశించారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ఉల్లి పాలసీ ముసాయిదాను అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఉల్లి ధరల్లో హెచ్చుతగ్గులను నివారించడమేగాక, రైతులకు లాభం కలిగేలా ఉల్లి విధానం రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ముసాయిదాకు తుది రూపు ఇవ్వాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో అన్ని యార్డుల్లో ఆటోమేటెడ్ గేట్ ఎంట్రీ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు.