
ముంపు గ్రామప్రజలతో కలసి సహపంక్తి భోజనం చేస్తున్న మంత్రి హరీశ్
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలోని బీడు భూముల్లో గోదావరి, కృష్ణా జలాలు పారించే ప్రయత్నంలో భాగంగా గ్రామాలు, భూములు కోల్పోయిన నిర్వాసితులను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అనంతగిరి సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని కొచ్చగుట్టపల్లి నిర్వాసితులకు పునరావాసం, ఉపాధిలో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలం లింగారెడ్డిపల్లిలో 140 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి బుధవారం మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రిజర్వాయర్‌లో గ్రామం మొత్తం మునిగిపోతోందని, పాత గ్రామానికి తీసిపోని విధంగా కొత్త గ్రామం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
నిర్వాసితుల త్యాగ ఫలంతోనే..
సంస్కృతి, సంప్రదాయాలు, తీపి గుర్తులను త్యా గం చేసి ప్రాజెక్టుల నిర్మాణానికి చేయూతనిచ్చిన నిర్వాసితుల త్యాగఫలమే రాష్ట్రానికి సాగునీరు అని హరీశ్ అన్నారు. మల్లన్న సాగర్ కింద 8 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, వారికి గజ్వేల్ పక్కనే మొట్రాజుపల్లి వద్ద నూతన గ్రామాలు నిర్మిస్తామన్నారు. మరోవైపు కొండపోచమ్మ ప్రాజెక్టులో మునిగిపోయే మరో రెండు గ్రామాలకు తునికి బొల్లారం వద్ద డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి త్వరలో భూమి పూజ చేస్తామని తెలిపారు. 123 జీవో ప్రకారం వారికి పరిహారం ఇచ్చామన్నారు.
2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు అధిక మొత్తం లో డబ్బులు చెల్లించలేకపోతున్నామని, అందుకే 21/2017 సవరణ చట్టం కింద మెరుగైన పరిహారం అందజేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాలు నిర్మించడం, ఉపాధి, యువతకు నైపుణ్యాల శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి హామీనిచ్చారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment