టిఫిన్‌దాత సుఖీభవ.. థాంక్యూ రాజన్న  | Maryala Rajanna Serving Free Breakfast To 10TH Class Students In Jagtial | Sakshi
Sakshi News home page

టిఫిన్‌దాత సుఖీభవ

Published Sat, Feb 15 2020 10:20 AM | Last Updated on Sat, Feb 15 2020 10:20 AM

Maryala Rajanna Serving Free Breakfast To 10TH Class Students In Jagtial - Sakshi

సాక్షి, సారంగాపూర్‌(జగిత్యాల): చదువుపై ధ్యాసపెట్టిన విద్యార్థులు చక్కగా చదువుకోవడానికి మర్యాల రాజన్న అందిస్తున్న అల్పాహారం ఎంతో దోహదపడుతోంది. పరీక్షల్లో మంచిర్యాంకులు సాధించాలనే తపనతో..విద్యార్థులు అదనపు తరగతుల్లో మునిగి ఆకలితో ఉంటున్నారు. కోనాపూర్‌ గ్రామానికి చెందిన మర్యాల రాజన్న విద్యార్థులకు నాలుగేళ్లక్రితం ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ ఏడాది మరిన్ని పాఠశాలలకు విస్తరించారు. ప్రస్తుతం మొత్తం 759 మంది విద్యార్థులకు ఈ ఏడాది అల్పాహారం అందించనున్నారు.

నాలుగేళ్లక్రితం మొదలైన కార్యక్రమం
పదోతరగతి విద్యార్థులతోపాటు, ఇంటర్‌ విద్యార్థులకు ఈ అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించుకున్నారు. మండలం కోనాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2016–17 సంవత్సరంలో 129 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలురాయగా వీరికి నాలుగునెలలపాటు అల్పాహారం అందించారు. ఆ తరువాత 2017–18లో 119 మంది, 2018–19లో 99 మంది ప్రస్తుత విద్యాసంవత్సరంలో 88 మంది విద్యార్థులకు అల్పాహారం సమకూరుస్తున్నారు. 

సారంగాపూర్, బీర్‌పూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో
సారంగాపూర్, బీర్‌పూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ కార్యక్రమం మూడేళ్లక్రితం ప్రారంభించి, ఇంటర్‌ మొదటి, రెండోసంత్సరం విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ ఏడాది సారంగాపూర్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 115 మంది, ఇంటర్‌ రెండో సంవత్సరంలో 77 మంది విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమం ప్రారంభించారు. బీర్‌పూర్‌ జూనియర్‌ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 163 మంది, ఇంటర్‌ రెండోసంవత్సరంలో 181 మంది విద్యార్థులకు అల్పాహారం సమకూర్చుతున్నారు. .

సారంగాపూర్‌ మండలంలోని ఇతర ఉన్నత పాఠశాలల్లో..
సారంగాపూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదోతరగతి విద్యార్థులకు గడిచిన మూడేళ్లుగా అల్పాహారం అందిస్తుండగా, ఈ ఏడాది 52 మందికి అందిస్తున్నారు. రంగపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 13 మందికి, అర్పపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 19 మందికి, రేచపల్లి ఉన్నత పాఠశాలలో 51 మంది పదోతరగతి విద్యార్థులకు నాలుగునెలలపాటు అల్పాహారం అందించే కార్యక్రమం ప్రారంభించారు. 

మా మంచి రాజన్న
కోనాపూర్‌ గ్రామానికి చెందిన మర్యాల రాజన్న జగిత్యాలలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. విద్యాభివృద్ధికి కొంత ఖర్చు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షల సమయంలో నాలుగునెలలపాటు అల్పాహారం అందించాలని నిర్ణయించుకున్నారు. ఆయన కుటుంబసభ్యుల సహకారంతో నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అల్పాహారంలో అటుకులు, ఉప్మా, మరమరాలు, మక్క అటుకుల వంటివి అందిస్తున్నారు. వీటిని రుచికరంగా తయారు చేయడానికి అందులోకి కావాల్సిన వస్తువులు పాఠశాలలకు, కళాశాలలకు పంపిస్తున్నారు.

కలెక్టర్‌ ఉత్తేజం స్ఫూర్తి నింపింది
కలెక్టర్‌ పదోతరగతి విద్యార్థులకు అల్పాహారం అందించడానికి ముందుకు రావాలని పిలుపునివ్వడం స్ఫూర్తినిచ్చింది. మనకున్న దానిలో కొంతైన ఇతరులకు ఖర్చు చేస్తే దేవుడు మనకు మరింత మంచి చేస్తాడనేది నా నమ్మకం. అందుకే ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చు అయినా కొనసాగిస్తా.
– మర్యాల రాజన్న

చదువుపై శ్రద్ధ పెంచుతుంది
రాజన్న సార్‌ మా కళాశాలలో అల్పాహారం అందిస్తున్నారు. టైంకు తినడంతో మాకు చదువుపై శ్రద్ధపెరుగుతుంది. రాజన్న కుటుంబానికి అంతా మంచి జరగాలి.
– తిరుపతి, బైపీసీ, రెండోసంవత్సరం, సారంగాపూర్‌
థాంక్యూ రాజన్న 
భవిష్యత్‌లో మేము ఉన్నతంగా ఎదిగితే..మేము రాజన్న సార్‌ చేపట్టిన కార్యక్రమాన్ని కొనసాగించాలని ఉంది. మాకు అందించే అల్పాహారం చాలా రుచిగా ఉంటుంది. 
– నవ్య, ఎంపీసీ రెండో సంవత్సరం సారంగాపూర్‌ జూనియర్‌ కళాశాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement