
నాగర్‌దొడ్డి అక్రమార్కులకు బిగుస్తున్న ఉచ్చు
♦ జూరాల ముంపు గ్రామంలో పరిహారం లెక్కింపులో భారీ అక్రమాలు
♦ ‘ఉమ్మడి’కాలంలో అవినీతి అధికారుల నిర్వాకం
♦ గుడిసెల్లాంటి నిర్మాణాలకు ఏకంగా రూ.కోటి అంచనాలు
♦ రెండేళ్ల కిందటే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’
♦ ఏడుగురు ఇంజనీర్లపై చర్యలకు విచారణ కమిటీ సిఫార్సు
♦ క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: అడ్డగోలు అంచనాలు, ఇష్టారీతి మదింపుతో జూరాల ముంపు గ్రామం నాగర్‌దొడ్డిలో లేని గృహాలను ఉన్నట్లుగా చూపి కోట్లు కొట్టేసేందుకు ప్రణాళికలు వేసిన ఇంజనీర్లకు ఉచ్చు బిగుస్తోంది. గృహాలకు పరిహార మదింపులో భారీ అక్రమాలకు పాల్పడి, తప్పుల తడకగా పరిహార అంచనాలు తయారు చేసిన ఏడుగురు ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లపై ప్రభుత్వం శాఖా పరమైన చర్యలకు సిద్ధమవుతోంది. ఈ అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ఉన్నతాధికారుల కమిటీ.. అక్రమాలు నిజమేనని తేల్చడం, వారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయడంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. ఇందులో ప్రమేయమున్న రెవెన్యూ, అటవీ శాఖ అధికారులపైనా చర్యలకు ఆయా శాఖలు సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది.
గుడిసె వంటి నిర్మాణాలకు రూ.20లక్షల పరిహారం..
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద మొత్తంగా 11 ముంపు గ్రామాలను గుర్తించారు. ఇందులో పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా ధారూర్ మండలం నాగర్‌దొడ్డి గ్రామం ప్రాజెక్టు ముంపు పరిధిలోకి వస్తుంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) నుంచి 100 మీటర్ల పరిధిలోని భూమిని సేకరించాలని ముందుగా నిర్ణయించారు. ఈ పరిధిలోకి వచ్చే గృహాలు, చెట్లు, స్థలాలు, వ్యవసాయ బావులు ఇతర నిర్మాణాలు ఏవి ఉన్నా వాటికి ప్రభుత్వం నిర్ధారించిన రేట్లతో పరిహారం చెల్లించాలి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌ఆర్‌ఎల్ నుంచి 100 మీటర్ల పరిధి అన్న నిబంధనను మార్చి మరింత ఎక్కువ పరిధితో లెక్కలు కట్టి పరిహారాన్ని పెంచారు.
ఇందులో భాగంగానే నాగర్‌దొడ్డి గ్రామంలో మొత్తంగా 148 నిర్మాణాలను రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్ శాఖలు ముంపు గృహాలుగా గుర్తించి వాటి పరిహార అంచనాలు సిద్ధం చేశాయి. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ నేతల ప్రోద్బలంతో ఆయా విభాగాల ఇంజనీర్లు, అధికారులు అడ్డగోలు అంచనాలు సిద్ధం చేశారు. రూ. 5 లక్షలు కూడా విలువచేయని గుడిసెల్లాంటి నిర్మాణాలకు ఏకంగా రూ. 20 లక్షల నుంచి రూ.1.05 కోట్ల వరకు పరిహారపు అంచనాలు తయారు చేశారు. కొన్ని గృహాల్లో 2 మీటర్ల దూరానికో పిల్లర్ చొప్పున నిర్మాణాలు చేసినట్లుగా గుర్తించి ఆ మేరకు అంచనాలు రూపొందించారు.
ఇక ఇళ్ల నిర్మాణంలో వాడిన కలపను 25 శాతం నుంచి 30 శాతం వరకు మాత్రమే లెక్కలోకి తీసుకోవాల్సి ఉండగా,, 60 శాతానికి మించి కలపను వాడినట్లు చూపారు. కొన్ని గృహాల్లో ఏకంగా 90 శాతం కలప వినియోగం జరిగినట్లుగా చూపి అంచనాలు వేశారు. కలపకు అటవీ శాఖ నిర్ణయించిన ధర అధికంగా ఉన్న దృష్ట్యానే అంచనాలు పెంచి చూపారు. కాగా, మనిషి కూడా పట్టనంత ఇరుకుగా సందుల నిర్మాణం, నివాసానికి యోగ్యం కాని రీతిలో.. అతుక్కున్నట్లుగా వీటిని నిర్మించడం సైతం అనుమానాలకు తావిచ్చేదిగా ఉంది.
ఇలా మొత్తంగా 148 గృహాలకు రూ.20 కోట్ల మేర పరిహారాలను లెక్కించి కోట్లు కొల్లగొట్టే యత్నం చేశారు. పరిహార మదింపు అంశంలో వివిధ శాఖల అధికారులతో పాటు అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నేతలకు ప్రమేయం ఉందని రెండేళ్లకిందటే ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. దీనిపై అప్పట్లోనే భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.
వాస్తవమేనన్న కమిటీ..
మంత్రి ఆదేశాల మేరకు ఆర్‌అండ్‌ఆర్ వ్యవహారాలు చూస్తున్న నీటి పారుదుల శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ కమిటీకి ఈ బాధ్యతలు కట్టబెట్టారు. నాగర్‌దొడ్డి గ్రామ గృహాల పరిహారం అంచనాల్లో తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా ఇందులో రెవెన్యూ, అటవీ, ఇరిగేషన్ శాఖల అధికా రుల ప్రమేయం ఉందని ఈ కమిటీ తన నివేదికలో తేల్చినట్లుగా తెలుస్తోంది. వాస్త వంగా అక్కడ చూపిన గృహాలన్నీ ఎక్కువ పరిహారాన్ని కొట్టేసేందుకు అప్పటికప్పు డు, హడావుడిగా తాత్కాలికంగా నిర్మిం చినవని కమిటీ గుర్తించింది. ఉద్దేశపూర్వకం గానే అంచనాల్లో అవకతవకలకు పాల్పడ్డా రని, ఇందులో అటవీ, రెవెన్యూ అధికారుల తో పాటు నీటి పారుదల శాఖకు చెందిన ఎస్‌ఈ, ఇద్దరు ఈఈలు, ఇద్దరు డీఈఈలు, మరో ఇద్దరు ఏఈలు ఉన్నట్లుగా కమిటీ తేల్చింది. పరిహారపు అంచనాల్లో అవకతవకలకు పాల్పడ్డ అధికారుల వివరణ తీసుకొని తదనుగుణ చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసినట్లుగా తెలిసింది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకోనుందని సమాచారం.