సాక్షి, సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని ఓ పాత సామాన్ల దుకాణంలో సంభవించిన పేలుడు స్థానికంగా కలకలం సృష్టించింది. బాంబు వల్లే ఈ పేలుడు సంభవించినట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జాతీయ రహదారికి అనుకుని, అయ్యప్ప దేవాలయం సమీపంలోని ఓ పాత ఇనప సామాన్ల దుకాణంలో శుక్రవారం ఈ పేలుడు సంభవించింది. వివరాలు.. ఖమ్మం జిల్లాకు చెందిన మెట్ట నాగరాజు గత కొంత కాలంగా జిల్లా కేంద్రంలో పాత ఇనుప సామాన్ల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ దుకాణంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 15 మంది వరకు పనిచేస్తున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి పాత సామాన్లను సేకరించి ఇక్కడకు తీసుకువచ్చి చిన్న చిన్న ముక్కలుగా రీసైక్లింగ్ చేసి హైదరాబాద్ తరాలిస్తుంటారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం ప్లాస్టిక్ డ్రమ్‌ను కట్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న మధ్య ప్రదేశ్‌కు చెందిన రామచంద్ర సహో అక్కడికక్కడే మృతి చెందగా.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సల్మాన్, సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలానికి చెందిన బుజ్జమ్మ, చిలకమ్మలకు గాయాలయ్యాయి.
క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుకాణంలోంచి ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో సమీప ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాంబు వల్ల పేలుడు జరగలేదని పేర్కొన్నారు. పాత వస్తువులను నిర్వీర్యం చేసేందుకు ఉపయోగించే యంత్రాలు కాలం చెల్లినవి వాడటం వలన పేలుడు సంభవించిందని అభిప్రాయపడుతున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించి పేలుడుకు గల కారణాలను త్వరలో వెల్లడిస్తామని డీఎస్పీ నాగేశ్వర్ రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment