కబ్జాల కళ్యాణం! | Me a new idea for the occupation | Sakshi
Sakshi News home page

కబ్జాల కళ్యాణం!

Published Wed, Dec 3 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

కబ్జాల కళ్యాణం!

కబ్జాల కళ్యాణం!

నాలా ఆక్రమణకు కొత్త ఉపాయం
 
‘ఫండ్ యువర్ సిటీ’ కింద దరఖాస్తు  అనుమతి లేకుండానే పనులు మొదలు కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ తీరు  కార్పొరేషన్ ఉదాసీనత
 
వరంగల్ : కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త స్కీములు అమలు చేసే కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్.. ఇప్పుడు తమ అవసరాల కోసం పబ్లిక్ నాలాను ఆక్రమించే విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తోంది. విపరీతమైన రద్దీ ఉండే ప్రధాన రోడ్డు పక్కన ఉన్న నాలాను సొంత అవసరాలకు వినియోగించుకునే పని మొదలుపెట్టింది. సామాజిక సేవ పేరుతో ఈ పని చేస్తోంది. ట్రాఫిక్ సమస్య  తీవ్రమైనా.. తమ వ్యాపారాలు సాఫీగా సాగితే చాలని పథకం రూపొందించింది. గతంలో కూడా ఇదే నాలాను కబ్జా చేసేందుకు యత్నించిన ‘కళ్యాణ లక్ష్మి’ యాజమాన్యానికి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పుడు సామాజిక సేవ పేరుతో మళ్లీ అదే చేస్తోంది.
 
నిబంధన ఉల్లంఘన

హన్మకొండ బస్‌స్టేషన్ నుంచి కాంగ్రెస్ భవన్ సర్కిల్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో కుడివైపు కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ ఉంది. నిబంధనల ప్రకారం షాపింగ్ మాల్ సెల్లార్‌లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తూ తమ షాపింగ్ మాల్‌కు వచ్చే వారి వాహనాలను మాల్‌కు ఎదురుగా పార్క్ చేస్తున్నారు. లక్కీడ్రా, బంపర్‌డ్రాల పేరిట వ్యాపారం చేస్తున్న ఈ షాపింగ్ మాల్ వద్ద రోజూ ట్రాఫిక్ జామ్ సమస్యలు ఉంటున్నాయి. కస్టమర్ల వాహనాలను రోడ్డు వెంబడే నిలిపేయడంతో సాయంత్రం సమయాల్లో ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు గంటల తరబడి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకుండా షాపింగ్‌మాల్ యూజమాన్యానికే సహకరిస్తున్నారు. దీనిని అలుసుగా చేసుకున్న కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ యాజమాన్యం.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న నాలానే పార్కింగ్ స్థలంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది.
 
సామాజిక సేవ పేరుతో..!

కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ ఎదురుగా నాలా ఉంది. వరంగల్ నగరంలో భూగర్భ డ్రెరుునేజీ వ్యవస్థ లేదు. వర్షాలు కురిసినప్పుడు షాపింగ్ మాల్ ముందున్న నాలా పొంగిపొర్లుతుంది. నాలాలో చెత్తచెదారం ఎక్కువగా పేరుకున్నప్పుడు తొలగించకపోతే మురుగునీరు బయటికి వస్తుంది. దీని వల్ల నాలాపై స్లాబ్ వంటి వేయకుండా ఉంటేనే మంచిది. ఇలా ఉంటే తమ షాపింగ్ మాల్‌కు వచ్చే వాహనాలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి యాజమాన్యం.. సామాజిక సేవ(ఫండ్ యువర్ సిటీ) పేరిట దీన్ని కబ్జా చేసి పార్కింగ్ స్థలంగా మార్చేందుకు సిద్ధమైంది. నాలా వల్ల రోడ్డుపై వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారని కార్పొరేట్ సామాజిక సేవలో భాగంగా నాలాపై స్లాబ్ నిర్మిస్తామని కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ వరంగల్ కార్పొరేషన్‌కు ప్రతిపాదించింది. కారణం ఏదైనా కార్పొరేషన్ అనుమతి వచ్చిన తర్వాత నిర్మాణం జరపాలి. ఇవేవి రాకుండానే కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ నాలాపై స్లాబ్ నిర్మాణం మొదలుపెట్టింది. రెండు రోజులు పనులు సాగాయి. స్థానికుల అభ్యంతరంతో కార్పొరేషన్ అధికారులు వచ్చి చూశారు. ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఇప్పుడు అందరికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో ఇదేతీరు..

కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. ప్రారంభమైన కొత్తలోనూ పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు నాలాను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. కాంక్రీటు నిర్మాణం చేపట్టారు. వరంగల్ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా ఉన్న అప్పటి కలెక్టర్ రాహుల్‌బొజ్జా దీన్ని తీవ్రంగా పరిగణించారు. నాలాను ఆక్రమించిన కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్‌పై చర్యలు తీసుకోవాలాని బల్దియూ కమిషనర్‌ను ఆదేశించారు. నాలాపై పార్కింగ్ వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, ప్రమాదాలు జరుగుతాయని.. అక్రమ నిర్మాణాలను తొలగించాలని పేర్కొన్నారు. పార్కింగ్ కోసం సెల్లార్ లేదా ఇతర ప్రత్యామ్నయం చూసుకోవాలని కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ యాజమాన్యానికి సూచించాలని చెప్పారు. కలెక్టర్ ఆదేశాలతో కార్పొరేషన్ అధికారులు నాలాపై నిర్మించిన స్లాబ్‌ను కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. కళ్యాణ లక్ష్మి యాజమాన్యం ఇప్పుడు మళ్లీ ఇదే పని చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement