గలగలలాడని గల్లాపెట్టె
⇒ క్రమబద్ధీకరణ ఆదాయం అంతంతే..
⇒ వస్తాయనుకున్నది రూ.408.99 కోట్లు
⇒ వచ్చింది రూ.153.36 కోట్లే..
⇒ మార్గదర్శకాల్లో కొరవడిన స్పష్టత
⇒ నిర్ధేశిత మొత్తం చెల్లింపునకు వెనుకడుగు
⇒ గడువు పెంచే యోచనలో సర్కారు..!
సిటీబ్యూరో: సర్కారుకు కాసులు తెచ్చిపెడుతుందని భావించిన క్రమబద్ధీకరణ ప్రక్రియ గాడి తప్పింది. కోట్లు వచ్చి పడతాయని భావించిన అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. మార్గదర్శకాల జారీలో జాప్యం.. దరఖాస్తుల పరిశీలనలో సాంకేతిక ఇబ్బందులు.. డీడీల రూపేణా నిర్ధేశిత మొత్తాన్ని చెల్లించాలనే నిబంధనలు ఇందుకు అడ్డుగా నిలిచాయి. ఈ ప్రక్రియ ద్వారా హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో రూ. 408.99 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, కేవలం రూ.153.36 కోట్లు మాత్రమే జమయ్యాయి. జంట జిల్లాల్లో 59 జీఓ కింద 26,392 దరఖాస్తులు రాగా (వీటిలో 13,607 అర్జీలు ఉచిత కేటగిరీ (జీఓ 58) నుంచి చెల్లింపు కేటగిరీలో మారాయి) సగానికి పైగా ప్రాథమిక స్థాయిలోనే తిరస్కరణకు గురయ్యాయి. 15,500 దరఖాస్తులను ఆర్డీఓ కమిటీలు పరిశీలించి 13,607 మాత్రమే క్రమబద్ధీకరణకు ఆమోదయోగ్యమైనవిగా తేల్చాయి. అయితే, ఈ దరఖాస్తుదారులు కూడా నిర్ధేశిత మొత్తాన్ని చెల్లించేందుకు మొగ్గు చూపలేదు. దీనికి అధికార యంత్రాంగం ప్రదర్శించిన గంద రగోళమే కారణమని తెలుస్తోంది. ఏకమొత్తం చెల్లించిన దరఖాస్తులకు కూడా మోక్షం కలగకపోవడంతో క్రమబద్ధీకరణపై అనుమానాలు పెరిగాయి. ఫలితంగా ప్రభుత్వం అంచనా తల్లకిందులైంది.
బోలెడు ఆశలు..
ఆక్రమిత స్థలాల్లో వెలిసిన కట్టడాలను క్రమబద్ధీకరించడం ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. భూముల విలువలు ఆకాశన్నంటినందున.. వీటి విలువ ఆధారంగా పెద్ద ఎత్తున రాబడి వస్తుందని భావించింది. అయితే, క్రమబద్ధీకరణ చెల్లింపులకు డిమాండ్ డ్రాఫ్ట్‌లతో ముడిపెట్టడంతో యజమానులు వెనక్కి తగ్గారు. ప్రతి చెల్లింపుపై ఆదాయ పన్నుల శాఖ (ఐటీ) నిఘా ఉంటుందని, దరఖాస్తు చేసుకునేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. మార్కెట్ విలువకు అనుగుణంగా కనీస ధరను నిర్ణయించడం కూడా వెనుకడుగు వేసేందుకు ఓ కారణమైంది. అయినప్పటికీ జంట జిల్లాల్లో రూ.153.36 కోట్లు చెల్లించారు. దీంట్లో 778 మంది ఏక మొత్తంలో నిర్ధేశిత రుసుం చెల్లించారు. వాస్తవానికి ఆమోదం పొందిన దరఖాస్తులతో ఖజానాకు రూ. 408.99 కోట్లు వస్తాయని అంచనా వేసింది. విధి విధానాల ఖ రారులో అస్పష్టత, మార్గదర్శకాలను సకాలంలో వెలువరించకపోవడంతో క్రమబద్ధీకరణపై దరఖాస్తుదారులకు అనుమానాలు పెరిగాయి. దీంతో అర్హత సాధించిన దరఖాస్తుదారులు కూడా నిర్ధేశిత ఫీజుల చెల్లింపుపై వేచిచూసే ధోరణి ప్రదర్శించారు. ఈ క్రమంలోనే తుది గడువు (ఫిబ్రవరి 29) ముగిసింది.
మరోసారి గడువు పొడిగింపు?
భూ క్రమబద్ధీకరణ (జీఓ 59) గడువును మరోసారి పొడిగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. దరఖాస్తుల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుకు సాంకేతిక సమస్యలు తలెత్తడం, కన్వీయెన్స్ డీడ్ ఖరారు కాకపోవడం, పాలనాపరమైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న సర్కారు ఈ దిశగా ఆలోచ న చేస్తోంది. మరోవైపు ఆమోదం పొందిన దరఖాస్తుదారులు కూడా స్థలాల క్రమబద్ధీకరణపై ఆసక్తి చూపకపోవడాన్ని క్షేత్రస్థాయిలో విశ్లేషిస్తున్న ఉన్నతాధికారులు.. గడువు పొడిగించే యోచనలో ఉన్నారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగానికి సంకేతాలిచ్చిన సర్కారు ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.