సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న మెట్రోపొలిస్ కార్యక్రమంలో మంగళవారం రెండోరోజూ సదస్సు వేదిక వద్దకు మీడియాను అనుమతించలేదు. సమీపంలోని హైటెక్స్ భవనంలోనే వారిని ఉంచి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు తిలకించే ఏర్పాట్లు చేశారు. కాని సదస్సులో ఒకే పర్యాయం మూడు, నాలుగు సమావేశాలు జరుగుతుండడంతో ప్రత్యక్ష ప్రసారాలు చేస్తున్న టీవీల గోల ఎక్కువైంది. సౌండ్ సిస్టం సరిగా లేకపోవడంతో టీవీల్లో సదస్సు దృశ్యాలు తప్ప, ఎవరేం మాట్లాడిందీ అర్థం కాలేదు. సాయంత్రం మీడియా సమావేశానికి హాజరైన జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చారు. మీడియాకు ఎదురైన ఇబ్బందులు.. కవరేజీకి అనుమతించకపోవడం.. ఉదయం నుంచి పడిగాపులు గాసినా ప్రయోజనం లేకపోవడం.. వంటి సమస్యలపై మీడియా ప్రతినిధులు ఆయనను చుట్టుముట్టారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. సాయంత్రం 5 గంటలకు విదేశీ మేయర్లతో ముఖాముఖి ఉంటుందని అధికారులు ప్రకటించినా, అనంతరం దాన్ని రద్దు చేశారు. సాయంత్రం 5 గంటలకు ఐటీ కారిడార్‌లో జరగాల్సిన (టీవీలో ప్రత్యక్షప్రసారం కావాల్సిన) మెట్రోపొలిస్ ప్రతినిధుల క్షేత్రస్థాయి పర్యటన కూడా రద్దయింది.
ప్రతినిధుల హాజరు..
అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సుకు దాదాపు రెండువేల మంది ప్రతినిధులు వస్తారని అధికారులు అంచనా వేయగా, మంగళవారం మధ్యాహ్నం వరకు 1309 మంది హాజరయ్యారు. వీరిలో విదేశీప్రతినిధులు 212 మంది కాగా, మిగతా వారు దేశంలోని వివిధ ప్రాంతాలు, మన రాష్ట్రానికి చెందినవారే. వీరిలో 60 మందికిపైగా మేయర్లున్నారు. రేపు, ఎల్లుండి కూడా ప్రతినిధులు రానున్నారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. దాదాపు 400 మందికిపైగా విదేశీప్రతినిధులు సదస్సుకు హాజరయ్యేందుకు పేర్లు నమోదు చేయించుకున్నారు.
రెండో రోజూ మీడియాకు అనుమతి నిరాకరణ
Published Wed, Oct 8 2014 2:02 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
Advertisement