గ్రేటర్ అభివృద్ధికి ఇది దిక్సూచి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోన్న హైదరాబాద్ ప్రస్తుతం, భవిష్యత్‌లో పలు సమస్యలను అధిగమించి అభివృద్ధి సాధించాల్సిన ఆవశ్యకతను‘సస్టైనబుల్ హైదరాబాద్ ప్రాజెక్టు పుస్తకం వివరించింది. ఈ పుస్తకాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు హెచ్‌ఐసీసీలో మంగళవారం జరిగిన మెట్రోపోలిస్ సదస్సులో ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో నగరం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు అన్వేషించాలో విశ్లేషించింది. ఈ పుస్తకంలో పేర్కొన్న అంశాలు ప్రభుత్వానికి దిక్సూచిలా పనిచేస్తాయని రచరుుతలు శ్రీగిరి శ్రీనివాస్‌రెడ్డి, చాలిగంటి రఘు, రమేశ్ చెన్నమనేని తెలిపారు. ఈ పుస్తకంలో హైదరాబాద్ అభివృద్ధికి అంశాలవారీగా తీసుకోవాల్సిన చర్యలిలా ఉండాలని వారు పేర్కొన్నారు.
వాతావరణ మార్పులు-నగర స్థానిక ప్రభుత్వం
ఇటీవలి కాలంలో గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలు పెరగడంతో నగర వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో నగర వాసుల్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. మంచినీరు, ఇంధన కొరత వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ పలు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆహారం, మంచినీరు, ఇంధన కొరత, రవాణా సదుపాయాల కల్పన వంటి అంశాలపై దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. నిపుణుల సలహాలు, సూచనలతో ఆయా అంశాల్లో పురోగతి సాధించేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలకు శ్రీకారం చుట్టాలి.
వాతావరణ మార్పుల నేపథ్యంలో నగర ప్రణాళిక
2031 నాటికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా(హెచ్‌ఎండీఏ) పరిధిలో సంభవించే వాతావరణ మార్పులను తట్టుకునేలా నగర అభివృద్ధి ప్రణాళికలుండాలి. నగర జీవనం, ప్రజలపై వాతావరణ మార్పులు చూపే ప్రభావాలను ముందుగానే అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో పురోగతి సాధించిన నగరాల అనుభవాలను పరిగణలోకి తీసకుంటే సత్ఫలితాలు సాధించవచ్చు. భవిష్యత్‌లో కాలుష్యానికి కారణమౌతోన్న గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను గణనీయంగా తగ్గించాల్సి ఉంది. మురికివాడలు లేని నగరంగా సిటీని తీర్చిదిద్దాలి. అన్నిరకాల మౌలిక వసతులు కల్పించాలి. భారీ వర్షాలు కురిసినపుడు లోతట్టు ప్రాంతాలు నీటమునగకుండా పటిష్ట చర్యలు చేపట్టాల్సి ఉంది. నగరం నలుమూలల్లో వరదనీరు,మురుగునీటి పారుదల వ్యవస్థలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలి.
ప్రజారవాణా
గ్రేటర్‌లో లక్షలాది మంది వ్యక్తి గత వాహనాలు వినియోగించకుండా ఉండేందుకు ప్రజారవాణా వ్యవస్థలను పటిష్టంగా తీర్చిదిదాలి. బస్సు సర్వీసులు, రోడ్‌నెట్‌వర్క్‌ను పెంచడంతోపాటు ఎంఎంటీఎస్, మెట్రో రైలు ప్రాజెక్టుల విస్తరణ చేపట్టాలి. బస్సులు మాత్రమే తిరిగేందుకు వీలుగా ప్రత్యేక మార్గాలు(బీఆర్‌టీఎస్) ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ వ్యవస్థను ఆధునీకరించాలి. పలు కూడళ్లను విస్తరించాలి. ప్రమాదకర మలుపులున్న ప్రాంతాల్లో రహదారులను తక్షణం విస్తరించాలి. బస్టాపుల్లోనే బస్సులను విధిగా ఆపేలా చూడాలి. స్టాపులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. పాదచారులు నడిచి వెళ్లేందుకు వీలుగా ఫుట్‌పాత్‌లను విస్తరించాలి. సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలి.
ఇంధన భద్రత
విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోన్న నేపథ్యంలో భవిష్యత్‌లో సౌరశక్తిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరముంది. సమగ్ర సోలార్ పవర్ పాలసీని రూపొందించాలి. సోలార్ పవర్ ప్రాజెక్టులకు పరపతి సౌకర్యాలు పెంచాలి. సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రభుత్వం తోడ్పాటునందించాలి. సౌర విద్యుత్ ప్లాంట్లకు స్థలం కేటాయింపు, పర్యావరణ అనుమతులు, గ్రిడ్ కనెక్టివిటీ వంటి అంశాల్లో సత్వరం అనుమతులు ఇవ్వాలి. పరిశ్రమలకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలి.
ఫుట్‌పాత్ వ్యాపారుల కోసం..
ఫుట్‌పాత్ వ్యాపారుల ప్రయోజనాలను రక్షించేలా స్ట్రీట్ వెండర్స్ పాలసీని రూపొందించాలి. నగరంలో ఆహార భద్రత పెంచడం, ఉపాధి అవకాశాల విస్తరణ, పర్యాటక కేంద్రాల వద్ద చిరువ్యాపారాల విస్తరణ విషయంలో సమగ్ర విధానం అవసరం.
పర్యావరణ విద్య
నగర జీవనం కాలుష్యకాసారం కాకుండా ఉండేం దుకు అన్ని వర్గాల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. నగర వాసుల జీవనశైలి పర్యావరణ హననానికి కారణం కారాదు. పర్యావరణ అనుకూల దృక్పథం అలవరుచుకునేందుకు పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయిలుతోపాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలను, కాలనీ సంఘాలను పర్యావరణ పరిరక్షణ కృషిలో భాగస్వాములను చేయాలి.
తాగునీరు, పారిశుద్ధ్య పనుల్లో ప్రజల భాగస్వామ్యం
గ్రేటర్ నగరంలో అందరికీ స్వచ్ఛమైన తాగునీటి కల్పన జఠిలంగా మారింది. పేదలు నివసిస్తున్న బస్తీలకు మంచినీటి సరఫరా అరకొరగానే ఉంది. ఈవిషయంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. వాటర్‌పాలసీ రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూడాలి. నీటినాణ్యత,స్వచ్ఛత పెరిగేలా చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ్యం విషయంలోనూ ప్రజల భాగస్వామ్యం లేనిదే సత్ఫలితాలు సాధించలేము. రాజీవ్ ఆవాస్ యోజన వంటి పథకాలతో మురికివాడల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.