కావాల్సింది సమ్మిళిత అభివృద్ధే
సాక్షి, హైదరాబాద్: నగరాలను కాంక్రీట్ జంగిల్స్‌గా మార్చొద్దని, సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. నగరాల్లో అందరికీ ఇళ్లు, శాటిలైట్ టౌన్‌షిప్‌ల ఏర్పాటు, తగిన మురుగునీటి వ్యవస్థ, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పెరగడంతో ప్రపంచంలోని నగరాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో 11వ మెట్రోపొలిస్ అంతర్జాతీయ సదస్సును గవర్నర్ లాంఛనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో గవర్నర్‌తోపాటు సీఎం కె.చంద్రశేఖర్‌రావు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, సీఎస్ రాజీవ్ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు.
అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ‘అందరికీ నగరాలు’ అనే ప్రధాన అంశంపై చర్చించడం ఎంతో ఉపయోగకరమని, మన నగరాలకు సమ్మిళితఅభివృద్ధి ఎంతో అవసరమని అన్నారు. హైదరాబాద్‌ను ఈ సదస్సుకు వేదికగా ఎన్నుకోవడం పట్ల మెట్రోపొలీస్ సంస్థను అభినందించారు. అభివృద్ధి చెందుతున్న నగరంగా అన్ని అభిప్రాయాలు, సూచనలు చర్చించేందుకు హైదరాబాద్ అనువైన వేదికగా నిలుస్తుందన్నారు. నాయకత్వం, ప్రణాళికలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణల విషయంలో ప్రైవేట్ కంపెనీల్లో ప్రభుత్వ సంస్థలు పనిచేసే అద్వితీయమైన అవకాశాన్ని మెట్రోపొలీస్ సదస్సు కల్పించిందన్నారు. ప్రస్తుత సదస్సు భవిష్యత్ నగరాల ప్రణాళికలో మహిళలు, యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సదస్సుకు హాజరైన వారు హైదరాబాద్‌కు ప్రత్యేకమైన ముత్యాలను తీసుకోవాలని ప్రతినిధులకు సూచించారు.
గ్లోబల్ సిటీగా మార్చేందుకు
సమగ్ర ప్రణాళిక: సీఎం కేసీఆర్
హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి గ్లోబల్ స్మార్ట్‌సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర బృహత్ ప్రణాళికను అభివృద్ధి చే స్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన క్లుప్తంగా.. మూడు నిముషాలు కూడా మించకుండా మాట్లాడారు. తెలంగాణలో ఈ సదస్సును నిర్వహించడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. తెలంగాణలోని మొత్తం జనాభాలో 40 శాతం పట్టణ జనాభానేనన్నారు. హైదరాబాద్ ప్రపంచస్థాయి ఆర్థిక పురోగతి ఉన్న నగరమని పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన వనరులన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. చారిత్రక నగరమే కాకుండా సాంస్కృతిక భిన్నత్వానికి కేంద్రంగా హైదరాబాద్ నిలిచిందన్నారు.
భవిష్యత్ నగరాలకు కీలకం: జీన్‌పాల్
మెట్రోపొలీస్ సదస్సు అధ్యక్షుడు జీన్‌పాల్ ఫ్రెంచ్‌లో మాట్లాడుతూ తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈ కాంగ్రెస్‌ను నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ సదస్సు ప్రతినిధులకు మంచి ఆతిథ్యాన్ని అందించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సులో చర్చిస్తున్న అంశాలు భవిష్యత్ నగరాలకు ఎంతో అవసరమన్నారు. నగరాల్లో మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల పట్ల తగిన శ్రద్ధను తీసుకోవాల్సి ఉందన్నారు.
సవాలును అవకాశంగా తీసుకుంటాం: వెంకయ్య
శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణ సవాలే అయినప్పటికీ.. దీన్నే ఒక అవకాశంగాా మలుచుకొని సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వినియోగదారులకు నమ్మదగిన సేవలు, ప్రపంచస్థాయి వైద్య సేవలు అందించే నగరాలు పెట్టుబడులను ఆకర్షిస్తాయన్నారు. ఇందుకు పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో సుస్థిరతను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి పరచాలని తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. ప్రస్తుతం దేశంలోని పట్టణ జనాభా 31 శాతం మాత్రమే ఉన్నప్పటికీ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 60 శాతం తోడ్పాటు అందిస్తోందని పేర్కొన్నారు. రానున్న 15 ఏళ్లలో దేశంలో పట్టణ జనాభా మరో 15.7 కోట్లకు పెరుగుతుందని, 2050 నాటికి ఇది 50 కోట్లకు చేరుతుందని చెప్పారు. వెంకయ్య తన ప్రసంగ ప్రారంభంలో వేదికపై ఉన్నవారి పేర్లను ప్రస్తావిస్తూ.. కేసీఆర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేర్కొని ఆ వెంటనే సరిదిద్దుకున్నారు. ఆ వెంటనే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూద నాచారిని సైతం ఏపీ స్పీకర్‌గా పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు బంగారు భవిష్యత్తు ఉందన్నారు. దేశంలోనే తొలిసారిగా నగరంలో ఈ సదస్సు నిర్వహించడం గర్వకారణమని నగర మేయర్ మాజీద్ హుస్సేన్ పేర్కొన్నారు.
కర్బన రహిత నగరమే నా స్వప్నం: అబ్దుల్ కలాం
కర్బన రహిత నగరమే తన స్వప్నమని, విశ్వనగరమంటే తన దృష్టిలో కర్బన రహిత నగరమేనని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్పష్టం చేశారు. రానున్న 20 ఏళ్లలో స్వచ్ఛమైన పర్యావరణ నగరాలను నిర్మించడంపై అందరూ దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తే క్రమంగా ఇంధన వినియోగ ఖర్చులు తగ్గిపోయి ఉచిత విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. భవిష్యత్తు అంతా సౌర విద్యుత్ నగరాలదే నని అభిప్రాయపడ్డారు. మెట్రోపొలిస్ సదస్సులో భాగంగా ‘సిటీస్ ఫర్ ఆల్’ అనే అంశంపై నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో కలాం కీలకోపన్యాసం చేశారు. ఏ నగరమైనా ప్రజలు ఆరోగ్యకరంగా జీవించే విధంగా ఉండాలని సూచిం చారు. చండీగఢ్ నిర్మాణ తీరు తనను ఎంతో ఆకట్టుకుందని, ఆ నగరం నుంచి ఎంతో నేర్చుకోవచ్చన్నారు. డీఆర్‌డీవో మాజీ డెరైక్టర్ వీకే సారస్వత్ మాట్లాడుతూ... స్మార్ట్ సిటీలంటే డిజిటల్ టెక్నాలజీ ఒక్కటే కాదన్నారు. ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల వినియోగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్ మేయర్ పార్క్స్ టావ్ మాట్లాడుతూ... తమ దేశ జనాభాలో 50 శాతం మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారన్నారు. హరిత భవనాలు, పరిశోధన కేంద్రాల స్థాపనతో పాటు మెరుగైన మౌలిక వసతులతోనే స్మార్ట్ సిటీలు సాధ్యమవుతాయన్నారు.