నేడో రేపో సీఎల్పీ విలీనం | Merge of CLP Will Be Today Or Tomorrow | Sakshi
Sakshi News home page

నేడో రేపో సీఎల్పీ విలీనం

Published Thu, Apr 25 2019 2:39 AM | Last Updated on Thu, Apr 25 2019 10:23 AM

Merge of CLP Will Be Today Or Tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితిలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం విలీన ప్రక్రియ చివరి దశకు చేరింది. మరో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సైతం టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన 11 మంది ఎమ్మెల్యేలను అందుబాటులో ఉండాలని టీఆర్‌ఎస్‌ ఆదేశించింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా ప్రకటించగానే మొత్తం 13 మంది సంతకాలు సేకరించి శాసనసభ స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ పోలింగ్‌ జరిగే మే 6వ తేదీకి ముందే ఈ విలీన ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 19 స్థానాల్లో గెలుపొందింది.

ఈ నేపథ్యంలో 13 మంది ఎమ్మెల్యేలు కలిసి ఆ పార్టీని వీడి, మరో పార్టీలో చేరితే కాంగ్రెస్‌ శాసనసభాపక్షాన్ని సరదు పార్టీలో విలీనం చేసినట్లుగా గుర్తిస్తారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వలస మొదలైంది. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, పి.సబితారెడ్డి, హరిప్రియా నాయక్, కె.ఉపేందర్‌రెడ్డి, డి.సుధీర్‌రెరెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్‌రావు, జాజుల సురేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేల చేరికకు ముహూర్తం ఖరారైందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.వారిద్దరూ చేరిన వెంటనే విలీన ప్రక్రియ పూర్తవుతుంది.

నేడు గవర్నర్‌ వద్దకు కాంగ్రెస్‌...
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, ఇంటర్‌ ఫలితాలలో ప్రభుత్వ వైఫల్యాలపై ఫిర్యాదు చేయాలని ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా నిర్ణయించాయి. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నేతలు గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేయనున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement